Bharat Ratna for NTR: ఎన్టీఆర్ కు భారతరత్న.. మోడీ సంచలన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు సైతం జాతీయ రాజకీయాల్లో రాణించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించడంలో చంద్రబాబు...

Written By: Dharma, Updated On : March 13, 2024 2:18 pm

Bharat Ratna for NTR

Follow us on

Bharat Ratna for NTR: ఎన్టీఆర్.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవం ఆయన. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలందరూ ఆరాధ్యుడిగా భావిస్తారు.తెలుగువారి ఆత్మగౌరవానికి సూచికగా ఎన్టీఆర్ ను కొలుస్తారు. అలాంటి నేతకు జాతీయస్థాయిలో తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన తెలుగువారిలో ఉంది. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. తెలుగు వారి నుంచి వినిపిస్తూనే ఉంది. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల జాతీయ స్థాయిలో సేవలు అందించిన పలు రాష్ట్రాల ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఇటువంటి తరుణంలో ఎన్టీఆర్ పేరు తాజాగా తెరపైకి రావడం విశేషం.

ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు సైతం జాతీయ రాజకీయాల్లో రాణించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించడంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ విఫలమైందన్న విమర్శ ఉంది. ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు ఒక ఐకాన్ గా భావిస్తారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో ఆయన ట్రెండ్ సెట్టర్. ఢిల్లీ పాలిటిక్స్ ను ఎదిరించి సత్తా చాటిన నేత. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పెత్తనం చెలాయిస్తున్న రోజుల్లో ఆ పార్టీని ఎదుర్కొన్న ధీ శాలి. టిడిపి స్థాపించిన తర్వాతే ఏపీలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. మరోవైపు జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు సైతం ఎన్టీఆర్ దిక్సూచిగా నిలిచారు. లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ఏకైక ప్రాంతీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కావడం విశేషం. అప్పట్లో ఎన్టీఆర్ ఈ ఘనతను సాధించారు. సంచలనం సృష్టించారు. సంక్షేమ పాలనకు ఆరాధ్యుడు కూడా ఆయనే. అటువంటి నేతకు భారతరత్న అవార్డు ఇవ్వడం సమంజసమే.

ఇటీవల కాలంలో భారతరత్న లేదా పద్మ పురస్కారాల గ్రహీతలను పరిశీలిస్తే.. సమాజానికి పరిచయం అక్కర్లేకున్నా.. వారి సేవలను పరిగణలోకి తీసుకొని పెద్దపీట వేశారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. జాతీయస్థాయిలో గుర్తింపు లభించలేదన్న అభిప్రాయం ఉంది. ఇటీవలే తెలుగు ప్రముఖుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రకటించారు. అప్పుడే ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల తెలుగుదేశం పార్టీతో బిజెపికి పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ నెల 17న మూడు పార్టీల ఉమ్మడి ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇంతలో ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గ చివరి సమావేశంలో ఇదే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నందమూరి తారక రామారావుకు జాతీయస్థాయిలో నిలువెత్తు గౌరవం దక్కినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.