Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా మీడియాలో, పార్టీలో సాగుతున్న ప్రచారమే నిజమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మంగళవారం భేటీ అయిన అనంతరం.. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. ఈమేరకు లేఖను జాతీయ అధ్యక్షుడికి అందించారు. సంజయ్‌కు మరో రకంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టుగా బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇక ఈటల రాజేందర్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల నిర్వహణ కమిటీ పోస్టు క్రియేట్ చేసి చైర్మన్‌గా నియమించింది. ఈమేరకు కూడా ఉత్తర్వులు వచ్చాయి.
సంజయ్‌తోనే జోష్..
తెలంగాణలో నామమాత్రంగా ఉన్న బీజేపీకి సంజయ్ జవసత్వాలు తెచ్చారు. మూడేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంజయ్ కొన్ని కఠిన నిర్ణయాలతో పార్టీని పరుగులు పెట్టించారు. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్‌షా అందండలతో తెలంగాణ సర్కార్‌పై దూకుడుగా వ్యవహరించారు. అధ్యక్షుడి దూకుడుతో క్యాడర్ కూడా అంతే దూకుడు ప్రదర్శించింది. దీంతో పార్టీలో జోష్ వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో మరింత ఉత్సాహం పెరిగింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో సీట్లు గెలుచుకుంది. ఒక దశలో బీఆర్‌ఎస్‌ను ఓడించినంత పనిచేసింది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ ఈటలను భారీ మెజారిటీతో గెలిపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తృటిలో గెలుపు చేజారింది.
వరుస ఫిర్యాదులతో..
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు బండి సారథ్యంలోనే వెళ్లాలని బీజేపీ అధిష్టానం భావించింది. అందుకే పదవీకాలం ముగిసినా ఆయననే కొనసాగించాలని నిర్ణయించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కూడా ప్రకటన చేశారు. కానీ, పదవీకాలం ముగియడంతో బండిని మారుసా‍్తరని భావించిన నేతలకు ఈ నిర్ణయం మింగుడు పడలేదు. దీంతో సంజయ్‌ను తప్పించాలని ఒత్తిడి తెచ్చారు. ఫిర్యాదులు చేశారు. చివరగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో సంజయ్‌ను మార్చాలని అధిష్టానం నిర్ణయిచింది. చివరకు మార్చేసింది.