https://oktelugu.com/

Bandi Sanjay KCR: కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్.. బండి సంజయ్ లాజిక్ తో కొట్టాడే..

Bandi Sanjay KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ తన ఓటమిని అంగీకరించరు. దాన్ని దృష్టి మరలిస్తారు.. హుజూరాబాద్లో బీజేపీ గెలవగానే.. ‘మద్ధతు’ ధర విషయంలో కేంద్రం చేస్తున్న వైఖరికి నిరసనగా ఏకంగా కేసీఆర్ ధర్నా చేశాడు. పార్లమెంట్ లోనూ లొల్లి చేసి ఆగమాగం చేశారు. అలా హుజూరాబాద్ లో బీజేపీ గెలుపును కనుమరుగు చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ పోరాటాన్ని అంతే చక్కగా పక్కదారి పట్టించడానికి కేసీఆర్ భారీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2022 / 01:50 PM IST
    Follow us on

    Bandi Sanjay KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ తన ఓటమిని అంగీకరించరు. దాన్ని దృష్టి మరలిస్తారు.. హుజూరాబాద్లో బీజేపీ గెలవగానే.. ‘మద్ధతు’ ధర విషయంలో కేంద్రం చేస్తున్న వైఖరికి నిరసనగా ఏకంగా కేసీఆర్ ధర్నా చేశాడు. పార్లమెంట్ లోనూ లొల్లి చేసి ఆగమాగం చేశారు. అలా హుజూరాబాద్ లో బీజేపీ గెలుపును కనుమరుగు చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ పోరాటాన్ని అంతే చక్కగా పక్కదారి పట్టించడానికి కేసీఆర్ భారీ స్కెచ్ వేశారు. రైతాంగ ప్రయోజనాలు అంటూ ప్రధాని మోడీకి లేఖ రాసి దాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు.

    అయితే కేసీఆర్ ఎత్తులు, జిత్తులు తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలెర్ట్ అయ్యారు. కేసీఆర్ అబద్ధాల లేఖకు గట్టి కౌంటర్ గా మరో లేఖ రాశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ లేఖను కేసీఆర్ ఏకంగా మోడీకి రాశారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ లేఖ ఏంటి? కేసీఆర్ ఎందుకు ఇలా డైవర్ట్ రాజకీయం చేస్తున్నాడనే దానిపై స్పెషల్ ఫోకస్..

    రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రమైన ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న ఈ తరుణంలో వాటిని దారి మళ్లించేందుకే ప్రధానమంత్రికి బహిరంగ లేఖ పేరిట మీరు కొత్త డ్రామాకు తెరదీసినట్లు కన్పిస్తోంది. మీరు అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో ‘సకినాల పిండి’ని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినా మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా ఎదురు దాడి చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నందున వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

    రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తానని ఇచ్చిన మాటకు కేంద్రం కట్టుబడి ఉంది. ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలులో భాగంగా ఏటా కనీస మద్దతు ధరను పెంచడంతోపాటు రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికి వడ్లు, గోధుమలు, మొక్కజొన్న, కందులుసహా 23 రకాల పంట ఉత్పత్తులకు ఇస్తున్న కనీస మద్దతు ధరలతో పోలిస్తే నేడు 50 నుండి 100 శాతానికిపైగా ధరలు పెరిగాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరి ధాన్యం కనీస మద్దతు ధర 2014లో క్వింటాలుకు రూ.1310 లుగా ఉండగా… నేడు రూ.1960కి చేరింది. రాగులు క్వింటాల్ కు ఆనాడు రూ.1500 కనీస ధర ఉంటే… నేడు రూ.3377 కు చేరింది. పత్తి ధర క్వింటాల్ కు రూ. 4050 ఉండగా… నేడు బహిరంగ మార్కెట్లో 9 వేలకు పైగా అమ్ముడుపోతూ రైతులకు లాభాలు పండిస్తోంది. సన్ ఫ్లవర్ నాడు రూ.3710లు ఉంటే… నేడు రూ.6015కు చేరుకుంది. అంటే దాదాపు రెట్టింపు ధరను రైతులు పొందుతున్నారు. మిగిలిన పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ ఎంత పెరిగిందనే వివరాలను కూడా ఈ లేఖతో మీకు జత పరుస్తున్నాను.

    కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒనగూర్చినదేమిటి? పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బోనస్ పేరిట రైతులకు క్వింటాల్ ధాన్యానికి రూ.200 నుండి రూ.600 ల వరకు చెల్లిస్తున్నాయి. కానీ మీ ప్రభుత్వం మాత్రం నయాపైసా కూడా బోనస్ ఇవ్వడం లేదు. పైగా ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదంటూ కొత్త డ్రామాలకు తెరదీశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించి రైతులను గాలికొదిలేసేందుకు సిద్ధమయ్యారు. ధాన్యం కొనుగోలుపై మీరు చేసిన అసంబద్ధమైన ప్రకటనలవల్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కుప్పలపై పడి 50 మందికిపైగా రైతులు ప్రాణాలొదిశారు. అయినా ఏమాత్రం సిగ్గు లేకుండా మీ చేతగానితనాన్ని కేంద్రంపైకి నెట్టేసే యత్నం చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం గత ఏడేళ్లలో దాదాపు రూ.85 వేల కోట్లు ఖర్చు చేసింది. కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు కొనడం మొదలు అందుకు అవసరమయ్యే గన్నీ సంచులు, సుతిలి తాడు, హమాలీ, రవాణా, గోడౌన్ ఖర్చులతోసహా అన్నింటికీ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తోంది. కానీ మీరు చేసిందేమిటి? ఈ ఏడేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం కేంద్రమే భరిస్తోంది.

    తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి గింజను కేంద్రమే కొనడంతోపాటు ధాన్యం కొనుగోలు కు సంబంధించి మొత్తం సొమ్మును రాష్ట్రానికి వడ్డీతోసహా చెల్లిస్తోంది. కానీ మీరు 48 గంటల్లో ధాన్యం కొనుగోళ్ల డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించి మాట తప్పారు. నెలలు గడుస్తున్నా చెల్లింపులు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ వానా కాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇంకా రూ.2,626 కోట్ల బాకీ ఉన్న సంగతి నిజం కాదా? అయినప్పటికీ మీరు వ్యవహరించిన తీరును చూసి తెలంగాణ సభ్య సమాజం అసహ్యించుకుంటోంది. ఇన్నాళ్లూ… ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందని ప్రచారం చేసుకున్న మీరు రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసే సరికి ఢిల్లీ పర్యటన పేరిట కొత్త డ్రామాలకు తెరదీశారు. ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని కేంద్రానికి రాసిన లేఖలో సంతకం చేసిన మీరు….మళ్లీ బాయిల్డ్ రైస్ రైతుల విషయంలో మీరు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో పచ్చి అబద్దాలతో కూడిన లేఖ రాస్తూ కొత్త నాటకాలను తెరదీస్తున్నారు. మిర్చి పంటకు కనీస ధర చెల్లించాలని అడిగిన పాపానికి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన నీచ చరిత్ర కలిగిన మీరు కేంద్రానికి సుద్దులు చెప్పే అర్హత మీకు లేదు. ముఖ్యమంత్రి గారూ… మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్దమా?

    మీరు ఎరువుల ధరలు పెరుగుతన్న అంశాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల కొరత కారణంగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోతున్న మాట వాస్తవమే. కానీ ఆ భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో పాత ధరలకే రైతులకు కేంద్రం ఎరువులను సరఫరా చేస్తోంది. ఎరువుల సబ్సిడీ పేరిట గత ఏడేళ్లలో కేంద్రం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా? కానీ మీరు చేసిందేమిటి? రాష్ట్ర రైతాంగానికి ఎరువులను ఫ్రీగా సరఫరా చేస్తామంటూ 2017 ఏప్రిల్ 13న మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఐదేళ్లయినా తెలంగాణ రైతాంగానికి ఎరువులను ఫ్రీ గా ఇవ్వలేదు. మాట తప్పినందుకు ప్రజలను క్షమాపణ అడిగి తలదించుకోవాల్సింది పోయి సిగ్గూఎగ్గూ లేకుండా ఎదురుదాడి చేయడం నీచాతినీచం కాదా? బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి రాకముందు ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి క్యూ లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి ఉండేది నిజం కాదా? మోడీ హయాంలో రైతులకు సకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందుతున్న మాట నిజం కాదా? తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బంది భవిష్యత్తులోనూ రాకూడదనే ఉద్దేశంతో రూ.6100 కోట్లతో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరించిన సంగతిని మీరు విస్మరించారా?

    అన్నీ తెలిసి ఎందుకీ నాటకాలు సీఎం గారూ.. ‘రైతు బంధు’ ఒక్కటి ఇచ్చి రైతు సబ్సిడీలన్నీ ఎత్తేసిన మీరు రైతుల గురించి మాట్లాడటం గురివింద గింజ సామెతను తలపిస్తోంది. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీని గాలికొదిలేశారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ గతంలో ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం ఉంటే… నేడు పూర్తిగా బంద్ చేశారు. భూసార పరీక్షలకు కేంద్రం నిధులిస్తున్నా దారి మళ్లిస్తూ మీ ఫాంహౌజ్ లోని భూములకు మాత్రం భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. అకాల వర్షాలకు గత ఏడేళ్లుగా రైతులు నష్టపోతూనే ఉన్నా వారికి ‘క్రాప్ ఇన్సూరెన్స్’ను అమలు చేసి ఆదుకున్న పాపాన పోలేదు. రైతులను నట్టేట ముంచుతూ ‘‘రాబందు’’గా మారిన మీరు ‘రైతు బంధు’గా వర్ణించుకుంటూ సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా మీ ఉంది యవ్వారం. మీరు నిజంగా ‘రైతు బంధు’ అయితే రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఎందుకు ఉంటుంది? రైతన్నకు అప్పు పుట్టక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఎందుకు దాపురాంచింది? అప్పులు పెరిగి మిత్తీ కట్టలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొంది? రైతులకు బ్యాంకులు సకాలంలో అప్పులిచ్చే విషయంపై జరిగిన బ్యాంకర్ల సమావేశానికి ఏణాడూ హాజరుకాని సీఎం మీరు. కేంద్రం ఏటా నిర్వహించే క్రాప్ ప్లాన్ మీటింగ్ కు ఒక్కసారి కూడా హాజరుకాకుండా ముఖం చాటేసిన ముఖ్యమంత్రి మీరు మాత్రమే. ‘రైతు బంధు’ పేరిట ఒకవైపు రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంటే… అదే సమయంలో రైతులు తీసుకున్న రుణాలకు మిత్తీ కట్టలేదనే సాకుతో బ్యాంకు అధికారులు రైతు బంధు సొమ్మును జమ చేసుకోవడం నిజం కాదా? ఏటా రూ.10 వేల కోట్ల రైతు బంధు సొమ్ము ఇస్తున్నట్లు ఘనంగా చెప్పుకుంటున్న మీరు…. ఊరూరా 10 బెల్టుషాపులు తెరిచి మద్యం తాగిస్తూ ఎక్సైజ్ శాఖ ద్వారా అంతకు మూడు రెట్లు అదనంగా అంటే ఏటా రూ.30 వేల కోట్లకుపైగా దండుకోవడం నిజం కాదా? మద్యనిషేధ శాఖ పేరు పెట్టుకుని మద్యాన్ని ఏరులై పారిస్తున్న మీరు ఇకపై ఆ శాఖ పేరును ‘‘మద్య ప్రోత్సాహక శాఖ’’ అని మారిస్తే బాగుంటుందేమో… మీరొక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి సీఎం గారూ…

    పెట్రోలు, డీజిల్ ధరల పెంపు గురించి మీరు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో పెట్రోలుపై లీటర్ కు రూ.10లు, డీజిల్ పై రూ.5లను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన మాట వాస్తవం కాదా? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ ను తగ్గించుకోవాలని సూచిస్తే.. దేశంలోని 19 రాష్ట్రాలు స్పందించి పెట్రోలు, డీజిల్ ధరలను లీటర్ కు సగటున రూ. 5 నుండి రూ.25 వరకు తగ్గించాయి. తెలంగాణ మాదిరిగానే కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రమైన జార్ఘండ్ లో లీటర్ కు రూ.25లు తగ్గించారు. కానీ తెలంగాణలో మాత్రం మీరు నయా పైసా కూడా తగ్గించుకుండా వ్యాట్ పేరిట వేల కోట్ల రూపాయలు దండుకుంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. నిజం చెప్పాలంటే పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై మీకు మాట్లాడే కనీస అర్హత కూడా లేదని బీజేపీ భావిస్తోంది.
    మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కమిటీని నియమిస్తే ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క సిఫారసు కూడా చేయని మీరు ఈ అంశంపై మాట్లాడటం అసహ్యం కలిగిస్తోంది. మీరు రాసిన లేఖను పరిశీలిస్తే… రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ఎట్లా నిర్ణయిస్తారో కూడా తెలియని అజ్జాని మీరు అని అర్ధమవుతోంది.

    విద్యుత్ సంస్కరణల చట్టంలో వ్యవసాయ భూములకు విద్యుత్ మోటర్లు బిగిటంచాలనే అంశమే లేదు. అయినప్పటికీ గత మూడేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్లు బిగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలనుకోవడం హేయనీయం. డిస్కంలను అప్పుల్లో ముంచి భవిష్యత్తులో కరెంట్ సంక్షోభాన్ని స్రుష్టించబోతున్న మీకు ఈ సందర్బంగా ఒక సవాల్ విసురుతున్నా. ఈ మూడేళ్లలో తెలంగాణలో ఎక్కడైనా ఒక్క రైతు పొలానికైనా కరెంట్ మీటర్లు బిగించినట్లు నిరూపించగలరా? ఒకవేళ మీరు నిరూపించకుంటే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నా సవాల్ కు స్పందించాలని కోరుతున్నా.

    రైతుల కోసం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మీరు కేంద్రంపై ఆరోపణలు చేస్తూ రాజకీయం చేయడాన్ని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవైపు బీజేపీ పోరాటాలను దారి మళ్లించడానికి, మరోవైపు మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్న నీ అవినీతి బండారాన్ని బయటపెట్టి చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో రైతుల పేరుతూ లేఖలు రాస్తూ ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నరు. అందుకే మీరెన్ని జిమ్మిక్కులు చేసినా రాజకీయ డ్రామాలకు తెరదీసినా… బీజేపీ మాత్రం ఆ ట్రాప్ లో పడదు. 317 జీవోను సవరించేదాకా పోరాడుతాం. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీలను భర్తీ చేసేదాకా ఉధ్రుతంగా ఉద్యమిస్తాం. వీటితోపాటు మీరు రైతుల కోసం గతంలో ఇచ్చిన ఈ కింది హామీలను అమలు చేయాలని, అట్లాగే రైతాంగ ప్రయోజనాల కోసం ఈ కింది డిమాండ్లను కూడా నెరవేర్చాలని కోరుతున్నాం.

    1. 2017 ఏప్రిల్ 13న మీరు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలి.
    2. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి.
    3. వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్ కు రూ.500 చొప్పున ‘బోనస్’ ప్రకటించాలి.
    4. కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడంతోపాటు పంటల ప్రణాళికను ప్రకటించాలి.
    5. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలి. పార్టీ కార్యకర్తలకు గాకుండా అర్హులైన రైతులకు మాత్రమే వాటిని అందించాలి.
    6. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్దరించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్ ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలి.
    7. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.
    8. విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేయాలి. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలి.
    9. అకాల వర్షాలకు నష్టపోతున్న రైతాంగానికి ఆదుకునేందుకు ‘క్రాప్ ఇన్సూరెన్సు’ పథకాన్ని అమలు చేయాలి.
    10. మార్కెట్లో ‘ఈ-నామ్’ పద్దతిని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలి.
    11. బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి.

    …. పైన పేర్కొన్న హామీలను, డిమాండ్లన్నింటనీ వచ్చే ఉగాది నాటికి అమలు చేయాలి. లేనిపక్షంలో రైతుల పక్షాన మరో మహోద్యమానికి శ్రీకారం చుడతామని బీజేపీ తెలంగాణ శాఖ తరపున హెచ్చరిస్తున్నాం.