Bandi Sanjay: వడ్ల కొనుగోలు అంశం రోజు రోజుకు పెద్దదవుతోంది. ఇది తిరిగి తిరిగి టీఆర్ఎస్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీని దోషిని చేయాలని చూసిన టీఆర్ఎస్ ప్లాన్ బెడిసికొట్టినట్లయ్యింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సెప్టెంబర్‌లో జరిగిన ఒప్పందాలను రైతుల ముందర ఉంచటంలో బీజేపీ సఫలమైంది. దీంతో టీఆర్ఎస్‌కు ఇబ్బందికర వాతావారణం ఏర్పడింది. ఇన్ని రోజులు చివరి గింజ వరకు తామే కొంటున్నామని చెప్పుకొచ్చిన టీఆర్ఎస్‌కు.. ఇప్పుడు కేంద్రమే కొనడం లేదని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే, తాము ఎలా వడ్లను సేకరించాలని చెబుతోంది. దీంతో వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరి పాత్ర ఎంతనేది రైతులు అర్థం చేసుకుంటున్నారు.

‘బండి’నెలా ఆపాలో తెలియక టీఆర్ఎస్ సతమతం..
వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానిదే తప్పని నిరూపించడంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొంత వరకు సఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే యాసంగి ధాన్యాన్ని కొనబోమని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. ఇప్పుడు వానాకాలం పంటను కల్లాల్లో ఉంది. దీనిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ పంట కొనుగోలు విషయం వచ్చిన ఇబ్బందేమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నా.. అది చాలా నెమ్మదిగా జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు.
Also Read: పెరుగుతున్న రాజకీయ వేడి.. బండి సంజయ్ మరో యాత్ర..
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లను తరువాత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే రైతు నుంచి రాష్ట్రం సేకరించి, రైతుల ముందుగా డబ్బులు అందజేయాల్సి ఉంటుంది. తరువాత కేంద్రం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐ వాటిని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అందజేస్తుంది. ఇది ప్రతీ సంవత్సరం జరిగే ప్రక్రియ. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు డైరెక్ట్‌గా ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇక్కడ ప్రతీ సంవత్సరం రైతులతో రాష్ట్ర ప్రభుత్వమే ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ అంశం వల్ల ఇప్పుడు టీఆర్ఎస్ పై రైతుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది.
Also Read: వరి రైతు ఆగం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినట్టేనా ?
ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ రెడీ అవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రం అంతా తిరుగుతూ రైతులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని, వాటినే రాష్ట్ర ప్రభుత్వంపై అస్త్రాలుగా ప్రయోగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో టీఆర్ఎస్ ఢిపెన్స్ లో పడింది. బండి సంజయ్ చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలో, ఆయనకు ఎలా బ్రేకులు వేయాలో అర్థకాని అయోమయ స్థితిలో పడిపోయింది. వడ్ల కొనుగోలు అంశంపై బీజేపీ క్యాష్ చేసుకుంటుంటే, టీఆర్ఎస్ మాత్రం రైతుల అసంతృప్తిని మూటగట్టుకుంటోంది.