Bandi Sanjay Jagarana : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జన జాగరణ దీక్ష హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ తలపెట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. రేపు ఉదయం 5 గంటల వరకూ నిద్రపోకుండా జాగరణ దీక్ష చేపట్టారు సంజయ్.

కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జన జాగరణ దీక్షకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. కరీంనగర్ లోని ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
జన జాగరణ దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దీక్ష శిభిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులు బీజేపీ శ్రేణులకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి మరికొందరినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో కరీంనగర్ లో హైటెన్షన్ నెలకొంది.
సంజయ్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత.. బండి సంజయ్ ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీస్ కమిషనర్ సత్యనారాయణ.. బండి సంజయ్ ను అరెస్టు చేస్తే ఊరుకోబోమంటూ కార్యకర్తల హెచ్చరిక. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహుతి చేసుకుంటామంటూ కార్యకర్తల హెచ్చరిక..కార్యకర్తలను వారిస్తున్న బండి సంజయ్
బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బండి సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవ్వగా పెట్రోల్ బాటిల్స్ తో బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్యాయాత్నం చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో కరీంనగర్ లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.