
Bandi Sanjay: కమలాపూర్ లో పదో తరగతి హింది ప్రశ్నపత్రం లీక్ రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్టును అరెస్ట్ చేసిన పోలీసులు.. శివ, శివ గణేష్ అనే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ప్రశాంత్ అనే వ్యక్తి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా పంపించాడని, దానికంటే ముందు ఫోన్లో మాట్లాడాడని గుర్తించిన పోలీసులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత అంటే బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు కరీంనగర్లోని జ్యోతి నగర్ లో బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు భారీగా మోహరించడంతో పోలీసు వాహనాల అద్దాలకు న్యూస్ పేపర్లు అడ్డం పెట్టుకొని బండి సంజయ్ ని నాటకీయ పరిణామాల మధ్య జనగామ మీదుగా పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. అక్కడినుంచి వర్ధన్నపేట మీదుగా జాఫర్ గడ్ తరలించారు.. కాసేపటి క్రితం హనుమకొండ మేజిస్ట్రేట్ రాపోలు అనిత ఎదుట హాజరు పరిచారు. అయితే ఈ క్రమంలో న్యాయస్థానం వెనుక గేటు నుంచి బండి సంజయ్ ని లోపలికి తీసుకెళ్లడం విశేషం.
అయితే బండి సంజయ్ ని తీసుకెళుతున్న విషయం తెలుసుకున్న భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ భారీగా మోహరించారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. విచక్షణ కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నాయకులు కోడిగుడ్లు, టమాటలతో పోలీస్ వాహనాల మీద విసిరారు. పరిస్థితి అదుపు తప్పుతోందన్న సంకేతాలు ఉండడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..
ఇక బండి సంజయ్ ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన నేపథ్యంలో ఆయన బెయిల్ కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో పోలీసులు ఏ_1 గా బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. హెచ్ఎంటీవీ మాజీ బ్యూరో చీఫ్ ప్రశాంత్ ను ఏ-2 గా పేర్కొన్నారు. అయితే బండి కి బెయిల్ వస్తుందా? రాదా? విషయం మీద ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్నది.

ఇక బండి సంజయ్ ను ఏ_1 గా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. పోలీసుల తీరును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ నాయకులు, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని వారు కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ తన నివాసంలో పరిశీలించారు. అనంతరం దానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా హోంశాఖ సెక్రటరీ, డిజిపిని బిజెపి ఐటి సెల్ నాయకులు పేర్కొన్నారు. వారే కాకుండా కరీంనగర్ పోలీస్ కమిషనర్, రాచకొండ పోలీస్ కమిషనర్, కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, యాదాద్రి జిల్లా బొమ్మలరామారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ లను కూడా సురేందర్ ప్రతివాదులుగా పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే గురువారం దీనికి సంబంధించి విచారణ జరగనున్న నేపథ్యంలో.. ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.
మరోవైపు హెచ్ఎంటీవీ వరంగల్ మాజీ బ్యూరో చీఫ్ ప్రశాంత్ టెన్త్ హిందీ పేపర్ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. అధికార భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ప్రశాంత్ కేంద్రంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రశాంత్ భారత రాష్ట్ర సమితి నాయకులతో కలిసి దిగిన ఫోటోలను భారతీయ జనతా పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఉంటే.. భారతీయ జనతా పార్టీ నాయకులతో ప్రశాంత్ దిగిన ఫోటోలను భారత రాష్ట్ర సమితి నాయకులు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక ఈ పరిణామాలతో తెలంగాణ వ్యాప్తంగా నిన్నటిదాకా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ విషయం ఒక్కసారిగా చల్లారిపోయింది. ప్రస్తుతం ఏ నోట విన్నా పదో తరగతి హిందీ పేపర్ లీక్ విషయం చర్చకు వస్తోంది.. ఇక బండి సంజయ్ వ్యవహారం నేపథ్యంలో “తెలంగాణ ముఖ్యమైన మంత్రి” కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. “పిచ్చోడి చేతిలో పార్టీ అధ్యక్ష పదవి ఉండకూడదని” ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. దీనికి ప్రతిగా భారతీయ జనతా పార్టీ నాయకులు ” బీఆర్ఎస్ డ్రామా పార్టీ” యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
ఇక ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, పోలీసులతో అధికార పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని వారు గవర్నర్ ను కోరారు. అయితే దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి నివేదికలు తెప్పించుకుంటానని గవర్నర్ వారికి హామీ ఇచ్చినట్టు రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.