Homeజాతీయ వార్తలుBandi Sanjay and Revanth Reddy are increasing the strength of KCR: కేసీఆర్‌...

Bandi Sanjay and Revanth Reddy are increasing the strength of KCR: కేసీఆర్‌ బలం పెంచుతున్న బండి సంజయ్, రేవంత్‌రెడ్డి..!

Bandi Sanjay and Revanth Reddy are increasing the strength of KCR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల సమయమే ఉంది. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కేసీఆర్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఎవరని ఓటర్లు, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో బలం పుంజుకోవాల్సిన విపక్షాలు.. కేసీఆర్‌కే అస్త్రాలు ఇస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ బలం పుంజుకునేలా ప్రవర్తిస్తున్నారు.

ఇలా అయితే బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మూడోసారి మళ్లీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న ప్రతిపక్ష పార్టీలను దీటుగా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మార్గాన్ని సుగమం చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో, పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న వారు చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌పై జనాల వ్యతిరేకత అటుంచి, ఆయా ప్రతిపక్ష పార్టీలనే వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడుతోంది. విపక్షాల తీరు ఇలాగే ఉంటే కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బండి సంజయ్‌ వ్యాఖ్యలతో పార్టీలో ముసలం
బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణ నేపథ్యంలో కవితను జైలుకు పంపించక ముద్దు పెట్టుకుంటారా అని చేసిన వ్యాఖ్యలు బీజేపీలో దుమారం రేపాయి. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తప్పు పట్టారు. బండి సంజయ్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, కవితపై చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు హోదా అంటే పవర్‌ సెంటర్‌ కాదు అంటూ అందరినీ సమన్వయం చేసే బాధ్యత అంటూ బండి సంజయ్‌కు చురకలు అంటించారు. దీంతో బండి సంజయ్‌ ధర్మపురి అరవింద్‌ మధ్య చోటు చేసుకున్న అంతర్గత వివాదాలు బహిర్గతమయ్యాయి. కమలనాథుల్లోనూ గ్రూప్‌ రాజకీయాలు ఉన్నాయన్న వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. ఇది కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది.

రేవంత్‌ రెడ్డి సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు..
ఇక టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయారంటూ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చేసిన సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ రెండో∙స్థానంలో ఉంది అని చెప్పి మరోసారి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలోకి చేరాలనుకున్న వారిని, సొంత పార్టీ నేతలు అడ్డుకున్నప్పటికీ పార్టీలో చేర్చుకోమని రాహుల్‌గాంధీ చెప్పారంటూ రచ్చ చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అధికారం మాదే అని చెప్పాల్సిన చోట రెండో స్థానంలో ఉన్నామని చెప్పడం కాంగ్రెస్‌ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు.

మాటలు తెచ్చిన తంటాలు …
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారికి భరోసానిచ్చి వచ్చే ఎన్నికలలో బలంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్న మాటలతోనే ఇప్పుడు వారికి కష్టాలు వచ్చి పడ్డాయి. ఇప్పటికే సొంత పార్టీలో ఎదురీదుతున్న రేవంత్‌రెడ్డి తాజాగా మరోమారు చేసిన వ్యాఖ్యలతో ముందు ముందు సొంత పార్టీ నేతల నుంచి మరింత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరోవైపు ధర్మపురి అరవింద్‌ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో అంతర్గత కలహాలు ఎక్కడ వరకు వెళతాయి అన్న చర్చ కూడా జరుగుతుంది.

కేసీఆర్‌ పని ఈజీ అవుతోందా..
విపక్షాలు అంతర్గత కలహాలతో సతమతం అవుతుండడంతో సీఎం కేసీఆర్‌ పని మరింత సులువు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా బలంగా ముందుకు వెళితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. అలాకాకుండా ప్రతిపక్షాలలో అంతర్గత కుంపట్లు ఉంటే కేసీఆర్‌కు అవే మరోమారు అధికారం కట్టబెడతాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు కేసీఆర్‌ పనిని బండి సంజయ్, రేవంత్‌రెడ్డి సులువు చేసేయడం చర్చనీయాంశం అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version