Balineni Srinivas Reddy : బాలినేని రచ్చ వ్యూహాత్మకమా.. జగన్ పై ఆగ్రహంగా వైసీపీ శ్రేణులు

స్థానిక ఎమ్మెల్యేగా త‌న‌కు తెలియ‌కుండా ఎవ‌రైనా వ‌స్తే, నేరుగా సీఎం జ‌గ‌న్ లేదా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు చెప్పొచ్చ‌ని వారు అంటున్నారు. కానీ అలా చేయకుండా ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని అనుమానిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 8, 2023 10:31 am
Follow us on

Balineni Srinivas Reddy : మాజీ మంత్రి బాలినేని వ్యూహాత్మకంగా వ్యవహరించారా? టీడీపీ అనుకూల మీడియా సహకారంతో అనుకున్నది సాధించారా? పార్టీ మార్పు ప్రస్తావన తెస్తూ కన్నీటిపర్యంతం కావడం వెనుక ఆయన నటన దాగి ఉందా? అటు సొంత పార్టీని బెదిరిస్తూ.. ప్రధాన ప్రతిపక్షాన్ని ఆకర్షించడమా? ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీలో బాలినేని వ్యవహారంపై మధనం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా వైసీపీకి నష్టం కలిగించే ఎత్తుగడ అని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ మెజార్టీ వర్గాలు ఇప్పుడు ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

బంధుత్వం ఉన్నా..
బాలినేని, ఆయన ప్రత్యర్థిగా భావిస్తున్న వైవీ సుబ్బారెడ్డి బావబావమ్మర్ధులు, అటు సీఎం దగ్గరి బంధువులు. అటువంటప్పుడు ఇంట్లో కూర్చొని పంచాయితీ చేస్తే సరిపోయి ఉండేది కదా అన్న ప్రశ్న పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.అయితే ఈ బంధుత్వం మాటున ఎప్పటి నుంచో వారి మధ్య ఆధిపత్యం నడుస్తోంది. అయితే సొంత బాబాయ్ అయ్యేసరికి వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అంతటితో చాలదన్నట్టు ఉత్తరాంధ్ర రీజనల్ స్థాయి పార్టీ పదవి కట్టబెట్టారు. బాలినేనికి ఉన్న మంత్రి పదవిని తొలగించారు. అయితే తనకంటే వైవీకే జగన్ ప్రాధాన్యతనిస్తుండడంతో ఎలాగైనా జగన్ కు గట్టి బదులివ్వాలని పార్టీని పణంగా పెట్టి బాలినేని సరికొత్త డ్రామా పండిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

బాధితవర్గాలు ఏకం..
అయితే ఇప్పుడు బాలినేని చర్యలు సీఎం జగన్ కు కోపం తెప్పించాయి. దీంతో బాలినేని బాధిత వర్గాలన్ని ఒక్కటవుతున్నాయి. ఆ బాధ్యతను వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్నారు. గతంలో తమతో బాలినేని వ్యవహరించిన తీరుపై అధినేతకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉద్దేశ పూర్వ‌కంగానే వైసీపీ కోఆర్డినేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం, అల‌క‌లో ఉన్న‌ట్టు టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇవ్వ‌డం, అలాగే ప్ర‌కాశం జిల్లాలో త‌న‌కు న‌చ్చ‌ని ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం వాస్త‌వం కాదా? అని అధికార పార్టీ నేత‌లు నిల‌దీస్తున్నారు. గతంలో బాలినేని వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపించారని.. ఇప్పుడు కూడా అటువంటి ఎత్తుగడే వేశారని చెబుతున్నారు.

జగన్ పై శ్రేణుల ఆగ్రహం
బంధువు అన్న కారణంతో బాలినేనికి జగన్ మితిమీరిన అవకాశాలు ఇచ్చారని.. ఇప్పుడవే చేటు తెస్తున్నాయని చెబుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచానని చెబుతున్న బాలినేని ఏనాడూ పార్టీకి ఉపయోగపడలేదని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని తట్టుకోలేుకపోతున్నారని చెబుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి సిఫార్సుతో డీఎస్పీ వ‌చ్చాడ‌నే ఉద్దేశంతో, బాలినేని ర‌చ్చ ర‌చ్చ చేయ‌డాన్ని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు గుర్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా త‌న‌కు తెలియ‌కుండా ఎవ‌రైనా వ‌స్తే, నేరుగా సీఎం జ‌గ‌న్ లేదా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు చెప్పొచ్చ‌ని వారు అంటున్నారు. కానీ అలా చేయకుండా ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేశారని అనుమానిస్తున్నారు. అటు టీడీపీ అనుకూల మీడియా ద్వారా తన టాస్కును నెరవేర్చుకున్నారని.. ఇక అధినేత జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకాశం వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.