Ganta Srinivasa Rao : వలసపక్షులు… వీటికి ఆకాశమే హద్దు. రెక్కల సత్తువతో ఎక్కడికంటే అక్కడకు హాయిగా ఎగిరిపోవడమే వీటికి తెలుసు. దారుల్లో తారసిల్లే కొండలు,గుట్టలు, సముద్రాలు దాటుకోని వెళ్లగలవు. అప్పటివరకూ ఉంటున్న వాతావరణంలో కాస్తా మార్పు కనిపించగానే..,అనుకూలమై వాతావరణం ఉండే చోటుకు వెతుక్కుంటూ ఎగిరిపోవడమే వాటికి తెలుసు. అయితే రాజకీయ వలస పక్షులదీ ఇదే మనస్తత్వం. అధికారమనే అనుకూల వాతావరణం వద్ద ఇట్టే వాలిపోతాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ రాజకీయ పక్షులు రెక్కల సత్తువను కూడదీసుకొని అవకాశం ఉన్నచోట వాలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.
పవర్ పాలిటిక్స్..
పవర్ పాలిటిక్స్ కు ఇష్టపడే నాయకుల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు. చేతిలో పవర్ ఉండాలి.. ఆ పవర్ ను ఎంజాయ్ చేయాలి.. అదే ఆయన మనస్తత్వం. ప్రతిపక్షంలో ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. అసలు అటువైపు చూడరుగాక చూడరు కూడా. టీడీపీ ద్వారా అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్ ల్లో సైతం కొనసాగారు. అక్కడ కూడా పవర్ ఎంజాయ్ చేశారు. అవి ప్రతిపక్షంలో చేరే సమయానికి.. తిరిగి అధికారాన్ని వెతుక్కుంటూ పూర్వాశ్రమం టీడీపీ వైపు వచ్చారు. ఇక్కడ కూడా పవర్ ఎంజాయ్ చేశారు. కానీ టీడీపీ ప్రతిపక్షంలో చేరడంతో తనకు తాను అచేతనుడినని చెప్పుకున్నారు. పార్టీకి దూరంగా జరిగారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో దగ్గర కావడం ప్రారంభించారు.
ఎమ్మెల్యేగా గెలిచినా..
గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గంటా గెలుపొందారు. కానీ రాష్ట్రంలో మాత్రం టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పోస్టు ఉంటే ఏమిటి? లేకుంటే ఏమిటి? అని ఆలోచించి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశారు. పార్టీకి దూరమయ్యారు. అసెంబ్లీకి గైర్హాజరవుతూ వచ్చారు. ఇదేంటని ప్రశ్నిస్తే అధికార పార్టీ వేధింపులు ఉంటాయని సంజాయిషీ ఇచ్చుకున్నారు. తొలి మూడేళ్లలో అధినేత చంద్రబాబు విశాఖ వచ్చినా కలిసేందుకు భయపడ్డారు. ఇప్పుడు టీడీపీకి అనుకూల వాతవరణం ఏర్పడడంతో అదంతా నా చలువే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. పార్టీలో యాక్టివ్ అవుతూ కనిపిస్తున్నారు.
అయ్యన్నే పెద్దదిక్కు..
గత నాలుగేళ్లుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. అధికార పక్షంతో పెద్ద యుద్ధమే చేశారు. ఈ క్రమంలో కేసులు, అరెస్టులను సైతం ఎదుర్కొన్నారు. పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపారు. అప్పడు కనిపించని గంటా..ఇప్పుడు మాత్రం కనిపించేసరికి అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవడండీ ఈ గంటా అంటూ గట్టిగానే ప్రశ్నించారు. అయితే ఎన్నికల్లో అందరి అవసరముంటుందని అధినేత సముదాయించడంతో సైలెంట్ అయ్యారు. గంటాను సిటీ వరకూ పరిమితం చేశారు.
రూరల్ పై పెత్తనానికి..
అయితే ఇప్పుడు గంటా రూరల్ జిల్లాపై పడుతున్నారని టాక్ నడుస్తోంది. అనకాపల్లి ఎంపీ సీటు విషయమే కాకుండా నర్శీపట్నం రాజకీయాలలోనూ జోక్యం చేసుకుంటున్నారని అయ్యన్న అనుమానిస్తున్నారు. దాంతో ఆయన గంటా మీద గరం గరం అవుతున్నారు. ఇంకో వైపు పాయకరావుపేటలో మరోసారి పోటీ చేయాలని చూస్తున్న రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు కూడా అక్కడ గంటా వర్గం చుక్కలు చూపిస్తున్నారుట. పాయకరావుపేటలో కాపులు ఎక్కువ. దాంతో ఆ వర్గం అనితను గంటా సూచనల మేరకు వ్యతిరేకిస్తోందని టాక్. అనిత అయ్యన్న వర్గంలో ఉండడమే ఇందుకు కారణం అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే గంటా రాజకీయంగా చురుకు కావడం వైసీపీ కంటే టీడీపీకే ఇబ్బందిగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీలో విభేదాలు తమకు లాభిస్తాయని వైసీపీ భావిస్తోంది