Ganapati Laddu Auction 2022: హైదరాబాద్ లో ఏటా నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకత ఉంటుంది. ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్ర తో పాటు బాలాపూర్ లడ్డు ప్రసాదం వేలం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తాయి. అందరూ అనుకున్నట్టుగానే బాలాపూర్ లడ్డు వేలంలో 24 లక్షల ధర పలికింది. దాన్ని అధిగమిస్తూ ఆల్వాల్ లో 46 లక్షలు పలికింది. ఈ రెండు లడ్డుల వేలాన్ని మించి హైదరాబాదులోని బండ్లగూడ సన్ సిటీ లోని రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూ 60.80 లక్షల ధర పలికింది. వేలంలో సరికొత్త రికార్డును సృష్టించింది.

ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..
బండ్లగూడ సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ లో సంపన్నులే నివాసం ఉంటారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కో విల్లా రెండు కోట్లకు పైగానే ధర పలుకుతున్నది. హైదరాబాదులో సంపన్నులు ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఇది ముందు వరుసలో ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ గేటెడ్ కమ్యూనిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ఉత్సవాల్లో పాల్గొంటూ నవరాత్రి చివరి రోజు గణపతిని స్థానికంగా ఉన్న రాజేంద్రనగర్ చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఈసారి ఆర్వీ ద్వియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గణపతిని నిమజ్జనం చేసే రోజున లడ్డూను వేలం వేశారు. ఈ వేలం కార్యక్రమంలో రిచ్మండ్ విల్లాస్ లో ఉన్నవారే కాకుండా బయట వారు కూడా పాల్గొన్నారు. వారంతా శ్రీమంతులే కావడంతో పోటాపోటీగా లడ్డుకు ధర పెంచేశారు. చివరకు 60.80 లక్షలకు ఓ వ్యక్తి ఆ లడ్డును కొనుగోలు చేశారు. దీంతో బాలాపూర్, అల్వాల్ గణపతి లడ్డూల వేలం రికార్డులు బ్రేక్ అయిపోయాయి.

ఎందుకు ఇంత ధర
గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఏటా గణపతి లడ్డు వేలం ద్వారా ఈ సంస్థ నిధులు సమీకరిస్తుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ లోనే చారిటీ గ్రూప్ సభ్యులు నివాసం ఉంటారు. వారంతా కూడా వివిధ ఎన్జీవోల రోజూవారి కార్యక్రమాలకు తోడ్పాటు అందించేందుకు నిధులు సమీకరిస్తూ ఉంటారు. ఇందుకుగాను రిచ్మండ్ సన్ సిటీ లో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల లడ్డు వేలాన్ని ఉపయోగించుకుంటారు. ఈ ట్రస్టులో ఉండే వాళ్లంతా కూడా పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్, వ్యాపారులు, అగ్రికల్చరిస్టులు. వీరంతా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. వివిధ ఎన్జీవోలకు తోడ్పాటు అందిస్తూ ఉంటారు. కాగా ఈ సంవత్సరం లడ్డువేలం ద్వారా వచ్చిన 60 లక్షల రూపాయలను పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్జీవోలకు ఇస్తామని ఆర్వీ దియా ట్రస్ట్ బాధ్యులు తెలిపారు. కాగా ఈ ట్రస్ట్ కు మేనేజింగ్ ట్రస్టీలుగా అర్చన సిన్హా, పూర్ణిమ దేశ్ పాండే వ్యవహరిస్తున్నారు. కరోనా ఒకటి, రెండు దశల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ట్రస్ట్ ఇతోధికంగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది.