AP and Telangana Electricity Dues Issue: తెలుగునాట విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న కేసీఆర్, జగన్ ల మధ్య రాజకీయంగా మంచి స్నేహ సంబంధాలే నడుస్తున్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నారు. అటు కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పోరాటం ప్రారంభించారు. జాతీయ పార్టీ ఏర్పాటులో తలమునకలై ఉన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూటగట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఏపీలో విషయానికి వచ్చేసరికి మాత్రం సైలెంట్ అయ్యారు. అటు తన స్నేహితుడైన జగన్ ను, విపక్ష నేత చంద్రబాబు మద్దతును కోరే ప్రయత్నం చేయడం లేదు. మిత్రుడు జగన్ పై అవినీతి కేసులు ఉన్న దృష్ట్యా కేంద్రంతో ఇబ్బందులు వస్తాయని భావించి సంప్రదించడం లేదు. అటు చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుండడం, రాజకీయంగా బద్ధ విరోధిగా ఉండడంతో ఆయన్ను కలిసేందుకు ఆసక్తిచూపడం లేదు. మొత్తానికైతే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన తరువాత తెలుగునాట ఎవరికి ఎవరు మిత్రులు? ప్రత్యర్థులు? అన్నది తేటతెల్లంకానుంది. స్పష్టత రానుంది. ప్రస్తుతానికి కేసీఆర్ మాత్రం ఏపీ జోలికి రావడం లేదు. కానీ తనకు నమ్మదగిన మిత్రుడుగా మాత్రం ఇప్పటికీ జగననే భావిస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాలకే పరిమితం..
అయితే కేసీఆర్, జగన్ మధ్య ఎంత స్నేహం ఉన్నా అవి రాజకీయ ప్రయోజనాలకే పనికొస్తున్నాయి. కానీ వారి వారి రాష్ట్ర ప్రయోజనాలకు కాదన్న విమర్శ అయితే ఉంది. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు దాటుతోంది. కానీ విభజన సమస్యలు మాత్రం కొలిక్కి రావడం లేదు. గతంలో చంద్రబాబుతో ఉన్న విరోధం కారణంగా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడూ ఇద్దరూ స్నేహితుగా ఉన్నా పరిష్కారానికి నోచుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుచేయడం, కోర్టులో కేసులు వేయడం వంటివి కండితుడుపేనని..అదంతా రాజకీయ డ్రామేనని.. కేసీఆర్ తో కూర్చొని మాట్లాడే స్నేహం ఉన్నప్పుడు.. కేంద్ర జోక్యం అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. కేంద్రం వద్ద పంచాయితీ ప్రజలను సంతృప్తి పరిచేందుకు మాత్రమేనని.. ఇందులో ఆయన చిత్తశుద్ధి ఏమీలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా విభజన హామీల విషయంలో ఏపీ నుంచే తమకు చెల్లింపులు రావాలని చెబుతున్నా జగన్ నేరుగా స్పందించడం లేదు. కేవలం అధికారులతో విన్నపాలు, కోర్టులో కేసులు వేయించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలతో కీలక సమావేశానికి సైతం ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు ముఖం చాటేశారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన జగన్..నేరుగా సమస్యల ప్రస్తావనకు అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు.

తాజాగా కోర్టును ఆశ్రయించిన తెలంగాణ..
ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను చెల్లించాలని జగన్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం స్పందించి జరిమానా రూపంలో తక్షణం ఏపీకి రూ.3,700 కోట్లు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ కోర్టులో పిటీషన్ వేసింది. ఏపీ నుంచే తమకు బకాయి రావాల్సి ఉందని వాదించింది. ఏపీ ట్రాన్స్ కో తమకు రూ.1700 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్ కో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఏపీ ప్రభుత్వం, ఏపీ ట్రాన్స్ కో తో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుతో కేంద్రం ఆదేశాలిచ్చిన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. కేంద్రం ఏకపక్షం నోటీసులు జారీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం వద్దకు పంచాయితీ తేల్చుకునేందుకు వెళ్లడం ఇష్టం లేకే తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కోర్టు తలుపు తట్టింది.
కేంద్రం సైలెంట్..
అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహం కేంద్రానికి తెలియంది కాదు. అయినా తన బాధ్యతగా విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవచూపింది. కానీ తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో కేంద్రం సైలెంట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసు తేలే వరకూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించదు. అసలు చెల్లించే ఉద్దేశ్యమే లేదు. ఎందుకంటే అది ఇప్పటి బాకీ కాదు. చంద్రబాబు హయాం నుంచే పంచాయితీ నడుస్తోంది. ఏదో అడగాలని భావించి మూడేళ్ల తన పాలన ముగించుకున్న తరుణంలో జగన్ మొక్కుబడిగా అడిగినట్టున్నారు. మధ్యలో కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టారు. కానీ కేసీఆర్ సర్కారు మాత్రం వ్యూహాత్మకంగా కోర్టు లోకేసు వేసింది.