Janasena and BJP: ఏపీ మిత్రుల పొత్తులు తేలినట్టు తెలిసింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నిలవగా.. ఈసారి ఏపీలోని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలకు జనసేనకు అవకాశం లభించినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలోని హుజూరాబాద్ తోపాటు ఏపీలోని బద్వేలు అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. తాజాగా బద్వేలు అసెంబ్లీ సీటులో పోటీపై బీజేపీ-జనసేన కీలక భేటి నిర్వహించాయి.

బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు , బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ లు సమావేశమయ్యారు. బద్వేలులో ఏ పార్టీ పోటీచేయాలనే దానిపై చర్చించారు.
సాధారణంగా పదవిలో ఉన్న వ్యక్తి చనిపోతే అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి తెలుగు రాష్ట్రాల్లో స్వస్తి పలికారు. బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వెంకటసుబ్బయ్య కరోనాతో గత మార్చిలో చనిపోయారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బద్వేలులో పార్టీల మధ్య పోటీ నెలకొంది.
ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి జనసేన పోటీచేయకుండా వైదొలిగేలా చేశారు. అలాగే ఏపీలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనకు బలం ఉన్నా కూడా బీజేపీ కోరిక మేరకు తప్పుకుంది. ఈ క్రమంలోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బద్వేలులో జనసేననే పోటీకి దిగాలని.. ఈ మేరకు బీజేపీని ఒప్పించాలని ఈ భేటిలో నిర్ణయించినట్టు సమాచారం. పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, రాష్ట్రస్థాయి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలని ఈ మీటింగ్ లో చర్చించినట్టు సమాచారం. పైగా వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న ఈ సమయంలో పవన్ తీసుకొచ్చిన ఊపు జనసేనకు కలిసి వస్తుందని.. అందుకే ఈసారి బీజేపీ కాకుండా జనసేననే బద్వేలులో పోటీచేయాలని మీటింగ్ లో నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బలమైన పార్టీ అభ్యర్థిని కూడా జనసేన దించేందుకు రెడీ అయినట్టు తెలిసింది.
బద్వేలులో ఎలాగైనా విజయం సాధించాలని పార్టీలన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ కూడా తమ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేసింది. వైసీపీ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య భార్య సుధను ప్రకటించింది. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బద్వేలు లో కూడా పోటీ ప్రధాన పార్టీల మధ్య నెలకొంది. బీజేపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. జనసేన ఈసారి అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీలో నిలవగా జనసేన మద్దతిచ్చింది. ఇక్కడ జనసేనకు బీజేపీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు .రెండు పార్టీలు కూర్చుని మాట్లాడుకుని అభ్యర్థిని నిర్ణయిస్తాయని ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు భేటి అయ్యారు. అయితే జనసేన బద్వేలు అభ్యర్థి విషయంలో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసమే పని చేస్తామని ఇరు పార్టీలు ప్రకటిస్తున్నాయి. జనసేన నిలబడితే స్వయంగా పవన్ కళ్యాణ్ బద్వేలులో మకాం వేసి అభ్యర్థి కోసం ప్రచారం చేసి గెలిపించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పార్టీనేతలందరు ఐక్యంగా పనిచేసి అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలించి 13 వరకు అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.