NTR 100 Rupees Coin
NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన స్మారకార్థం రూ.100 నాణాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా విచ్చేసి నాణాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని విస్మరించడంతో ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో లేవనెత్తిన అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ నాణాన్ని, టిడిపిని, చంద్రబాబును, ఆయన సంస్థ హెరిటేజ్ ను కలిపి సెటైర్లు వేస్తూ సాగిన ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కార్యక్రమ నిర్వహణలో వైసీపీ నేతగా ఉన్న లక్ష్మీపార్వతిని విస్మరించడం.. ఆ పార్టీలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఎన్టీఆర్ స్మారక వంద రూపాయల నాణెం పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. మిగతా కాయిన్స్, కరెన్సీ మాదిరిగా మార్కెట్లో చలామణి ఉండబోతున్నారు. దాని విలువను కూడా కేంద్ర ఆర్థిక శాఖ రూ. 4160గా నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి చంద్రబాబు బృందం చేసే హడావుడి అంతా కాదని ఎద్దేవా చేశారు.మింట్లో అచ్చు వేసి పన్నెండు వేల నాణాలను హెరిటేజ్ తో కొనిపిస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
అయితే విజయ్ సాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు విమర్శల పాలవుతున్నాయి వాస్తవానికి ఇలా దివంగత ప్రముఖుల పేరుతో కేంద్రం విడుదల చేసే నాణాలన్నీ చలామణి లోకి రావు. ఇవి వాస్తవ విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగానే ఉంటాయి. మామూలు నాణేల మాదిరిగా ఇవి తయారీ కావు. వెండి,రాగి వంటి లోహాలతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇవి మార్కెట్లో చలామణి కాకుండా.. గుర్తుగా ఉంచుకునేందుకు జనం కొనుక్కునేలా ప్రోత్సహించేందుకు విడుదల చేస్తారు. వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకుంటారు. కానీ విజయ్ సాయి రెడ్డి మాత్రం ఈ స్మారక నాణేలను రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తుండడం విచారకరం. ఆయన కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.