Uttam Kumar Vs Revanth: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయాలలో అందరికంటే ఒక అడుగు ముందు ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ 115 స్థానాలకు సంబంధించి తన అభ్యర్థులను ప్రకటించారు. ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించడానికి సమాయత్తమవుతోంది. గత సంప్రదాయానికంటే భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ దరఖాస్తుల్లో ఒక్క కొడంగల్ మినహా మిగతా స్థానాల నుంచి భారీగా దరఖాస్తులందాయి. అయితే ఇక్కడే అసలు సినిమా మొదలైంది.
గతంలో లేనిది
తమ నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీగా దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఒకింత ఆగ్రహం గా ఉన్నారు. ఈ దరఖాస్తు చేసే విధానం సరికాదు అంటూ పేర్కొంటున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ మీద పూర్తి పెత్తనం సాధించేందుకు రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని వారు వాపోతున్నట్టు తెలిసింది. ఇదే సందర్భంలో కొడంగల్ స్థానం నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టడమేంటి అనే ప్రశ్న సీనియర్ల నుంచి వస్తోంది. అయితే ఈ దరఖాస్తులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పరిశీలిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం.
అందువల్లే..
కాంగ్రెస్ పార్టీ గత సంప్రదాయానికి భిన్నంగా ఒక్క కుటుంబాన్ని నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామని షరతు పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే హై కమాండ్ కాబట్టి.. ముందుగా తమ నుంచే మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నుంచే ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేయకపోవడానికి కారణం కూడా ఇదే. అయితే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జానారెడ్డి తనకు, తన కుమారుడికి, ఉత్తంకుమార్ రెడ్డి తనకు, తన సతీమణికి టికెట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్క కుటుంబాన్ని నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ కాబట్టి.. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇలా రేవంత్ రెడ్డి చెప్పడం ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చడం లేదని, అందుకే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వాగ్వాదం పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. టికెట్ల కేటాయింపు సమయంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమేనని చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కి రేవంత్ రెడ్డి వచ్చి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ పూర్తి ఆధిపత్యం దక్కిందని, అందుకే ముందు వచ్చిన చెవుల కంటే, వెనుక వచ్చిన కొమ్ములు వాడి అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే మరోసారి భేటీలో ఎవరికి టికెట్లు కేటాయిస్తారు అనేది ఒకింత ఉత్కంఠ గా మారింది.