Rayalaseema Politics: రాయలసీమలోని రాజకీయ కుటుంబాలకు 2019 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ చేదు ఓటమిని మిగిల్చింది. ఓటమిని ఎరుగని కుటుంబాలు వారసుల పొలిటికల్ ఎంట్రీతో తొలిసారి ఓటమిని రుచిచూశాయి. పరిటాల, జేసీ, కేఈ, భూమా, బొజ్జల, గాలి ..ఇలా ఓటమి ఎరుగని కుటుంబాలకు తొలిసారి ఎదురుగాలి వీచింది. మరి 2024లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ?. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారా ? 2024లో గట్టెక్కుతారా ? అన్న చర్చ సీమలో మొదలైంది.

పరిటాల కుటుంబం రాజకీయ ప్రవేశం నుంచి 2019 వరకు ఓటమిని ఎరుగదు. తొలిసారి రాప్తాడులో ఓడిపోయింది. వారసుడిగా పరిటాల శ్రీరాంను తెరపైకి తెచ్చింది పరిటాల కుటుంబం. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేయించింది. కానీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారు. 25 వేల పై చిలుకు ఓట్ల తేడాతో పరిటాల కుటుంబం ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఓటమితో ఆ కుటుంబం కుంగిపోయింది. కానీ ఓటమిని స్పోర్టివ్ గా తీసుకుని పరిటాల శ్రీరాం మళ్లీ జనంలోకి వచ్చారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. కార్తకర్తలకు అండగా నిలబడుతున్నారు. కానీ 2024 ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేస్తారా ? రాప్తాడు నుంచి పోటీ చేస్తారా ? అన్న సందిగ్ధం టీడీపీ కార్యకర్తల్లో నెలకొంది. ధర్మవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో పరిటాల శ్రీరాం ధర్మవరం బాధ్యతలు తీసుకున్నారు. రాప్తాడు బాధ్యతలు పరిటాల సునీత తీసుకున్నారు. కానీ పరిటాల శ్రీరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న ప్రశ్నకు ఇంత వరకు స్పష్టత లేదు. రాప్తాడు, ధర్మవరంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ధర్మవరంలో త్రిముఖ పోటీ ఉంది. రాప్తాడులో ద్విముఖ పోటీ ఉంటుంది. పరిటాల శ్రీరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశం మీద గెలుపు ఆధారపడి ఉంటుంది.
జేసీ ఫ్యామిలీ రాజకీయ చరిత్ర కూడ ఓటమి ఎరుగనిది. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పదవి లేకుండా ఉన్న రోజులు లేవు. కాంగ్రెస్, టీడీపీలో సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. అనంతరం 2019లో వారసుల్ని రంగంలోకి దింపారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. తొలిసారి ఓటమిని చవిచూశారు జేసీ బ్రదర్స్. దీంతో అనంతపురం అర్బన్ స్థానం పై జేసీ పవన్ రెడ్డి కన్నేశారు. ఎమ్మేల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని టికెట్ తెచ్చుకుని గెలవగలరా ? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉంది. జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. మరి జేసీ పవన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థకం.

కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీది కూడ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. శోభానాగిరెడ్డి మరణం తర్వాత భూమా అఖలప్రియను భూమా నాగిరెడ్డి తెరపైకి తెచ్చారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిపించారు. అనంతరం కొన్ని రోజులకే భూమా నాగిరెడ్డి కూడ కాలం చేశారు. దీంతో 2019 ఎన్నికలు భూమా అఖిల ప్రియ తల్లిదండ్రుల అండ లేకుండా ఎదుర్కోవలసి వచ్చింది. ప్రతిర్థి చేతిలో ఓటమిని చవిచూసింది. నంద్యాలలో పోటీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి కూడ ఓడిపోయారు. భూమా వారసులు 2024లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కారణం ఆ కుంటుంబంలో మొదలైన ఆస్తి తగాదాలు. ఆస్తి తగాదాలతో ఇప్పటికే భూమా వారసులు రోడ్డుకెక్కారు. కుటుంబంలో గొడవలు రావడంతో 2024 ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతారన్న చర్చ మొదలైంది.
కర్నూలు జిల్లాలోని పత్తికొండ నుంచి పోటీ చేసిన కేఈ క్రిష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి పోటీ చేసిన కేఈ ప్రతాప్ ఓటమి పాలయ్యారు. చిత్తూరు జిల్లాలోని గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడకు గాలి భాను ప్రకాశ్ నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసిన బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ ఓటమిని చవిచూశారు. వీరందరూ 2024లో అదే స్థానాల నుంచి పోటీ చేసినా గెలుస్తారా లేదా అన్న చర్చ నడుస్తోంది.