Homeజాతీయ వార్తలుWomen Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆ ఇద్దరు వ్యతిరేకం.. వారు ఒకే...

Women Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆ ఇద్దరు వ్యతిరేకం.. వారు ఒకే పార్టీ ఎంపీలే..!

Women Reservation Bill 2023: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో బంపర్‌ మెజార్టీతో ఆమోదం పొందింది. అత్యాధునిక సదుపాయాలతో కొత్త పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా కేవలం రెండు ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభలోని 545 మంది ఎంపీలకు గానూ 456 మంది సభకు హాజరై ఓటు వేశారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు.

స్లిప్పుల ద్వారా ఓటింగ్..
ఆ తర్వాత మహిళా బిల్లుపై స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను ప్రారంభించారు. ఓటేసిన 456 మంది లోక్‌సభ సభ్యులలో 454 మంది మద్దతుగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు ఔరంగాబాద్‌/ఛత్రపతి శంభాజీనగర్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ వ్యతిరేకంగా ఓటు వేశారు. ముస్లిం హిళలకు రిజర్వేషన్లలో కోటా లేకపోవడంతో వీరు ఈ బిల్లును వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

బంపర్ మెజారిటీతో లోక్‌సభ ఆమోదం..
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇది కేవలం “సవర్ణ మహిళల”(అగ్రకుల మహిళలు) కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు, మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. మహిళా బిల్లును ‘‘చెక్ బౌన్స్ బిల్లు’’, ‘‘ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లు’’గా విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడిన ఓవైసీ.. కేంద్రం సవర్ణ మహిళల ప్రాతినిధ్యం పెంచాలని చూస్తోందని ఆరోపించారు. వారికి ఓబీసీ, ముస్లిం మహిళలు అక్కర్లేదని దుయ్యబట్టారు. 17వ లోక్ సభ వరకు మొత్తం 690 మంది మహిళా ఎంపీలు ఎన్నికైతే దీంట్లో కేవలం 25 మంది మాత్రమే ముస్లిం మహిళలు ఎంపీలుగా ఉన్నారని తెలిపారు. హిందూ జాతీయ వాదాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ మెజారిటీ, జాతీయవాదం పెరగడం హిందూ ఓటు బ్యాంకు ఏర్పడటం, ముస్లిం ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని, అది మరింగా తగ్గుతుందని మాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు.

చరిత్రలో నిలిచేది వారే..
ఇదిలా ఉండగా చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఎంపీలుగా అసదుద్దీన్, ఇంతియాజ్‌ జలీల్‌ మహిళా రిజర్వేషన్ వ్యతిరేకులుగా చరిత్రలో నిలిచిపోనున్నారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో యావత్ దేశంలోని మహిళలు ఆ ఇద్దరినీ దోషులుగా చూస్తున్నారు. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్ అంశం రాజ్యాంగంలో లేదని తెలిసి కూడా రిజర్వేషన్ లో ముస్లిం మహిళలకు కోటా అడగడం.. ఇందుకోసం మొత్తం బిల్లునే వ్యతిరేకించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version