YCP: వైసీపీలో వారికి టిక్కెట్లు లేనట్టే?

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు సిట్టింగ్ లు అందరూ టిక్కెట్లు కోరుకుంటున్నారు.గానీ సగానికి పైగా ఎమ్మెల్యేలు సొంత పార్టీ శ్రేణుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.

Written By: Dharma, Updated On : November 25, 2023 3:18 pm

YSRCP

Follow us on

YCP: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఝలక్ ఇస్తున్నారు. టికెట్ల విషయంలో ఇవ్వనని కరాకండిగా ముఖం మీద చెబుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తాను సర్దుబాటు చేసుకోండి అని తేల్చి చెబుతున్నారు. దీంతో నేతలకు షాక్ తగులుతోంది. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతోంది. టికెట్ పై నమ్మకం పెట్టుకుంటే.. ఇలా మడత పేచీ వేశారంటూ సిట్టింగులు, ఆశావహులు తెగ బాధపడుతున్నారు. సీఎం జగన్ చర్యలను తప్పుపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు సిట్టింగ్ లు అందరూ టిక్కెట్లు కోరుకుంటున్నారు.గానీ సగానికి పైగా ఎమ్మెల్యేలు సొంత పార్టీ శ్రేణుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. వారికి మరోసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడించేందుకు కూడా సిద్ధపడుతున్నారు. జగనన్న ముద్దు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. వారికి మరోసారి అవకాశం కల్పిస్తే పని గట్టుకొని ఓడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సొంత నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న చోట సిట్టింగులకు కొత్త భయం వెంటాడుతోంది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇటీవల సీఎం జగన్ ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం జగన్ చిరునవ్వు మందహాసంతో స్పందించారు. తన వద్ద అన్ని రకాల రిపోర్టులు ఉన్నాయని.. నీకు టిక్కెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే ఓడిస్తారని తేల్చి చెప్పారు. సీఎం నుంచి ఆ స్థాయిలో సమాధానం వచ్చేసరికి సంజీవయ్య నోటి మాట రాలేదు. ప్రత్యామ్నాయంగా సత్యవేడు నియోజకవర్గానికి వెళ్లాలని సంజీవయ్యను సీఎం జగన్ సూచించారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు సంజీవయ్య తటపటాయిస్తున్నారు.

13 జిల్లాల పరిధిలోని చాలా వరకు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ శ్రేణులే నిరసన గళం వినిపిస్తున్నాయి. తమకు సీఎం జగన్ అంటే అభిమానమని.. ఆయనను మరోసారి సీఎం చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి సీటు ఇస్తే మాత్రం ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి వారి విషయంలో సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ఆమోదముద్ర ఉంటేనే వారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రాష్ట్రంలో సగం మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు టిక్కెట్ల బెంగ వెంటాడుతుండడం విశేషం.