
AP Politics: గెలుపోటములన్నాక స్పోర్టివ్ గా తీసుకోవాలి. తరచూ వింటున్న మాటే ఇది. కానీ రాజకీయ గెలుపోటముల విషయానికి వచ్చేసరికి స్పోర్టివ్ అన్నదే కనిపించదు. కనీసం వర్తించదు కూడా. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఓడిన వారు ప్రత్యర్థులపై నెపం పెడుతున్నారు. అదీ ఒక గెలుపేనా అని ఎద్దేవా చేస్తున్నారు. అటు గెలిచిన వారు సైతం తమకు తిరుగులేదని భావిస్తున్నారు. ఏపీలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలే అందుకు ఉదాహరణం. అప్పటివరకూ ఓటములతో కుదేలైన టీడీపీకి ఈ ఫలితాలు జవసత్వాలు నింపాయి. లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాయి. అదే సమయంలో అంతులేని విజయాలతో ఉన్న వైసీపీకి షాకిచ్చాయి. స్పష్టమైన సంకేతాలు పంపించాయి.
ఓటమిని జీర్ణించుకోని అధికార వైసీపీ
అయితే గెలుపోటములను రెండు పార్టీలు స్పోర్టివ్ గా తీసుకున్నాయా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. పైగా వైనాట్ పులివెందుల, వైనాట్ కుప్పం అంటూ సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. వైసీపీ అంటేనే రాయలసీమ.. రాయలసీమ అంటేనే వైసీపీ అన్న రేంజ్ లో బంధం ముడిపడింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక్క అనంతపురం తప్ప.. మిగతా జిల్లాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. మరి అక్కడే కీలకమైన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓటమి చవిచూసింది. రాజధాని ఇస్తామన్న ఉత్తరాంధ్ర మేథావులు సైతం వైసీపీని తిరస్కరించారు. ఈ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించాల్సింది పోయి.. అధికార వైసీపీ పరనింద, ఆత్మస్తుతికే ప్రాధాన్యమిస్తోంది.
తలకెక్కించుకున్న టీడీపీ..
ఈ విజయాలను టీడీపీ మరింతగా తలకెక్కించుకుంటోంది. మూడు పట్టభద్రుల స్థానాలను 108 అసెంబ్లీ నియోజకవర్గాల విజయంగా చెప్పుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఈ 108 నియోజకవర్గాల్లో గెలుపు తమదేనని ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో కలిసి 160 సీట్లు కైవసం చేసుకుంటానని చెబుతోంది. చివరకు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల సైతం తమదేనని విజయ గర్వంతో సవాల్ చేస్తోంది. అయితే టీడీపీకి గెలుపు తలకెక్కించుకునే సమయం కాదు ఇది. పార్టీ శ్రేణులను తెరపైకి తెచ్చి సర్వశక్తులూ ఒడ్డాల్సిన సమయం ఇది, వచ్చే ఎన్నికల్లో కార్యోన్ముఖులు చేయాల్సిన గురుతర బాధ్యత నాయకత్వంపై ఉంది. అది చేయకుండా సవాళ్లు చేసుకుంటూ పోతే..నేలవిడిచి సాము చేసినట్టే.

రాజకీయ సవాళ్లతో సరి..
సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉంది. ముందస్తుకు వెళ్లడం లేదని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టుమార్టం చేసి ప్రజలకు ఎలా చేరువ కావాలన్న విషయంలో అధికార పార్టీకి సమయం ఉంది. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు తమవైపు తిప్పుకునేందుకు విపక్షాలకు సైతం చాన్స్ ఉంది. ఇటువంటి సమయంలో రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతున్నారన్న అపవాదు రెండు వర్గాలపై ఉంది. ఈనాడు గెలుపు తలకెక్కి ఓటమికి దారితీయవచ్చు.. నేడు ఓటమి ఎదురైనా..తప్పులు సరిదిద్దుకొని ముందుకెళితే గెలుపు బాట పట్టవచ్చు. కానీ ఏపీలో మాత్రం గెలుపు వస్తే స్వరం మార్చుతున్నారు. ఓటమి ఎదురైతే తప్పిదాలను అధిగమించే ప్రయత్నం చేయడం లేదు. ఇది ఫలితంగా రాజకీయ గందరగోళానికి కారణమవుతోంది.