Homeక్రీడలుRinku Singh: ఒకే ఓవర్ లో 30 పరుగులు.. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన...

Rinku Singh: ఒకే ఓవర్ లో 30 పరుగులు.. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన రింకు సింగ్..!

Rinku Singh
Rinku Singh

Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతోమంది హీరోలను చేసింది. అప్పటి వరకు అనామక క్రికెటర్లుగా ఉన్న.. ఎందరో రాత్రికి రాత్రి హీరోలయ్యారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలతో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. అటువంటి ఎందరో క్రికెటర్లు ప్రస్తుతం భారత జట్టులో స్టార్ క్రికెటర్లుగా ఎదుగుతున్నారు. తాజాగా మరో క్రికెటర్ ను ఓవర్ నైట్ స్టార్ చేసింది ఐపీఎల్. అతడే కోల్ కతా జట్టుకు ఆడుతున్న రింకు సింగ్. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్లో 5 బంతుల్లో ఐదు సిక్సులు కొట్టి జట్టుకు అమోఘమైన విజయాన్ని అందించాడు. అయితే ఈ క్రికెట్ ప్రయాణంలో రింకూ సింగ్ అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023వ సీజన్ 16వ ఎడిషన్ లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ తో రింకు సింగ్ గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు. అసాధ్యమైన లక్ష్యాన్ని తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో సాధ్యం చేసి చూపించాడు.

5 బంతుల్లో ఐదు సిక్సులతో విజయం..

ఆదివారం అహ్మదాబాద్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. 205 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు ధాటిగానే బ్యాటింగ్ చేసింది. అయితే మధ్యలో వికెట్లు పడిపోవడంతో లక్ష్యానికి దగ్గరలో నిలిచిపోయినట్లు కనిపించింది. చివరి ఓవర్ లో 29 పరుగులు చేస్తే విజయం లభిస్తుందన్న దశలో.. కేకేఆర్ జట్టు పూర్తిగా ఆశలు వదిలేసింది. చివరి ఓవర్ బౌలింగ్ వేసేందుకు వచ్చిన ఎస్ దయాల్.. మొదటి బాల్ కు సింగిల్ పరుగు ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ సింగిల్ తీసి రింకు సింగ్ కు బ్యాటింగ్ అప్పగించాడు. కేకేఆర్ విజయం సాధించాలంటే చివరి 5 బంతుల్లో 28 పరుగుల అవసరం. ఈ దశలో గుజరాత్ విజయం లాంఛనమే అనుకున్నారు అంతా. కానీ ఇక్కడే రింకు సింగ్ శివాలెత్తాడు. చివర 5 బంతులను ఐదు సిక్సులు గా మలిచి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. దీంతో ఓవర్ నైట్ స్టార్ గా రింకు సింగ్ ఎదిగిపోయాడు.

తీవ్ర ఇబ్బందులు పడిన రింకూ సింగ్..

రింకు సింగ్ క్రికెట్ ప్రయాణం అంత సానుకూలంగా ఏమీ జరగలేదు. అనేక ఇబ్బందులు పడి ఈ స్థాయికి ఎదిగాడు రింకు సింగ్. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కుటుంబంలో పుట్టిన రింకు సింగ్.. కుటుంబ పోషణ కోసం ఇళ్లల్లోనూ పనిచేశాడు. క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకోవడం కోసం అనేక ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు 2018 ఐపీఎల్ వేలంలో కోల్ కతా జట్టు రూ.80 లక్షలకు రింకు సింగ్ కొనుగోలు చేయడంతో అతని కష్టాలు తీరాయి. ప్రారంభ ధర రూ. 20 లక్షలు అయినప్పటికీ.. రింకు సింగ్ ప్రతిభను గుర్తించిన కేకేఆర్ రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది.

Rinku Singh
Rinku Singh

తనకంటూ ఒక గుర్తింపు తెచ్చే ఇన్నింగ్స్..

ఐపీఎల్ లో గత ఆరేళ్లుగా ఆడుతున్నప్పటికీ.. రింకు సింగ్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన ఇన్నింగ్స్ లు లేవనే చెప్పాలి. అడపాదడపా మెరుగైన స్కోర్ చేసినప్పటికీ.. రింకు సింగ్ కు రావాల్సినంత పేరు రాలేదు. కానీ ఆదివారం నాటి సూపర్ ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా హీరో అయిపోయాడు రింకు సింగ్. సునామీ ఇన్నింగ్స్ తో కేకేఆర్ జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించి పెట్టాడు. దీంతో కేకేఆర్ జట్టులో కీలకమైన ప్లేయర్ గా ఈ సీజన్ కు మారిపోయాడు.

RELATED ARTICLES

Most Popular