
CM Jagan: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో కోర్టుకు హాజరు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్నేళ్లుగా మినహాయింపు పొందుతూ వస్తున్నారు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డిని విచారించకుండా పురోగతి ఎలా సాధ్యమంటూ కోర్టు కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కోర్టుకు రావడం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతాయంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం గమనార్హం. కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన సాకులు ఏంటో మీరు చదివేయండి.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తితో జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారం పై తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణకు హాజరుకావాలని గత వాయిదాలు మెజిస్ట్రేట్ పేర్కొన్న నేపథ్యంలో.. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా పిటిషన్ వేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్ లో సీఎం కోరారు. ఈ సందర్భంగా పిటిషన్ లో పలు కీలక అంశాలను సీఎం ప్రస్తావించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం..
ఇక ఈ కేసు విచారణలో భాగంగా తాను హాజరు కావాల్సి వస్తే పలు ఇబ్బందులు ఎదురవుతాయని ఈ పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందని, పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడ్వకేట్ కమిషనర్ ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలని.. పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు.

లోతుగా దర్యాప్తు చేయాలంటూ మరో పిటిషన్..
సీఎం జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడి కత్తి కేసు ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ తనపై దాడి చేయించిందని చెప్పగా, సింపతి కోసమే వైసీపీ దాడి చేయించుకుందంటూ విమర్శలు ప్రతిపక్షాలు చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా ఇప్పుడు సర్వత్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు జరపాలంటూ మరో పిటిషన్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈనెల 13న విచారణ జరుపుతామని ఎన్ఐఏ కోర్టు తెలిపింది. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు వెళుతుందో అన్న ఆసక్తి నెలకొంది.