ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని నెలకు రూ.13 వేల నుంచి రూ.19 వేలకు పెంచాలని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం సిఫారసు చేసింది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సూచించింది. అదేవిధంగా పదవీ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 60 ఏండ్లకు పెంచాలని కూడా సిఫారసు చేసింది. అయితే.. ఈ ఫిట్‌మెంట్‌పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
Also Read: విశాఖ రైల్వేజోన్ కథ ముగిసినట్లేనా..?
ఏడున్నర శాతం పీఆర్సీ ఇవ్వాలని బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేస్తే.. ఉద్యోగ సంఘాలు అరవై శాతం కావాలని డిమాండ్ చేశాయి. కొన్ని ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చర్చించారు. కానీ.. ఉద్యోగ సంఘాలన్నీ కేసీఆర్‌తో తేల్చుకుంటామని ప్రకటించాయి. అంతే.. ఆ తర్వాత అంతా సైలెంటయిపోయారు. అటు కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు వస్తారో తెలియదు. ప్రగతి భవన్ నుంచి ఎప్పుడు ఫామ్‌హౌస్‌కి వెళ్తారో తెలియదు. ఎప్పుడు ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతారో క్లారిటీ లేదు. కానీ.. ఈ లోపు పుణ్యకాలం గడిచిపోతోంది. పీఆర్సీ ఇప్పుడప్పుడే లేదనే సంకేతాలను ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు పంపుతోంది.
మరోవైపు.. ఉద్యోగులు ఊహించనంత పీఆర్సీ ఇస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్లు ఊరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు కూడా కేసీఆర్ తప్పకుండా ఇస్తారనే భ్రమలోనే ఉన్నారు. అందుకే పెద్దగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం లేదు. కానీ.. ఉద్యోగ సంఘాల ఈ నిర్లక్ష్యంతో ప్రభుత్వం ఆ పిసరంత పీఆర్సీ ఇవ్వకపోయినా పోయిదేముందిలే అనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. సీఎస్ సోమేష్ నేతృత్వంలోని కమిటీ ఆ కమిటీతో చర్చించింది. ఇక నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు.
Also Read: మదనపల్లి జంట హత్యల్లో మరో కోణం
ఇతర సంఘాలతోనూ చర్చిస్తామని తాజాగా ప్రభుత్వ వర్గాలు సమాచారాన్ని లీక్ చేశాయి. ఇక చర్చల పేరుతో కాలయాపన చేసేలా ఉన్నారనే అనుమానాలు ఉద్యోగుల్లో ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో యూనియన్లను నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. సమ్మెకు దిగిన కార్మికులతోనే యూనియన్ లీడర్లపై విమర్శలు చేసే విధంగా చేసి విజయవంతమైంది. ఇప్పుడు ఉద్యోగుల విషయంలోనూ అదే ప్లాన్ కేసీఆర్ అమలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అనుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్