AP VS Telangana: ఏపీ తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలాయి. ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం వద్ద బిచ్చ మెత్తుకుంటోందని టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో నిజామాబాద్ కు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అవే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి ఆజ్యం పోశాయి.
తాజాగా ఈరోజు నిజామాబాద్ లో నిర్వహించిన రైతు ధర్నాలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నోరుజారారు. ‘కేసీఆర్ దయంతో తెలంగాణలో ఆదాయం పెరిగి అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని మనల్ని అన్నారని.. కానీ మన పైసలను మనమే వాడుకుంటున్నామని.. ఆంధ్రావాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారని.. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారని ఆరోపించారు. ఏపీలో రోజు ఖర్చులకు కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు అప్పులు చేయకుంటే ఏపీలో పాలన నడవదన్నారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గే ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార వైసీపీ భగ్గుమంది. మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చాడు. తెలంగాణ ఎన్ని అప్పులు చేసిందో బ్యాంకులను అడిగితే తెలుస్తుందన్నారు. జగన్ ఎప్పుడూ ఒకటే విధానంతో ముందుకు వెళుతున్నాడని.. కేసీఆర్ లాగా బయటకొక మాట.. లోపల ఒక మాట మాట్లాడడన్నారు. బయట కాలర్ ఎగరేసి.. లోపలికి వెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్ కు రాదని.. కేసీఆర్ నిధుల కోసం కేంద్రం వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడం చూడడం లేదా? అని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లాంటి పాడికుండను పెట్టుకొని కూడా తెలంగాణ అప్పుల పాలైందని.. ఆంధ్రావారి పెట్టుబడులతోనే హైదరాబాద్ ఎదిగిందని.. దాన్ని మీరు అనుభవిస్తున్నారని పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు.
మొత్తం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య తాజాగా రేపిన ఈ వివాదం రచ్చకు దారితీసింది. ఈ మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుందనేది వేచిచూడాలి.