గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ అధినేత రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీలోకి కొత్త నాయకులను పరిచయం చేయాలని చంద్రబాబు సమీకరణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఆ పార్టీ ఏపీకి రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు సిద్ధమయ్యారు.
ALso Read: వివేకా హత్య కేసులో కీలక మలుపు… ఆ పంచాయతీ హత్యకు కారణమా..?
ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో ఎర్రన్నాయుడి తమ్ముడు, ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి పేరు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. కానీ.. ఆయన ఆ పదవి చేపట్టేందుకు ఆసక్తిగా లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆయన అరెస్టు కావడంతో అప్పటి నుంచి పార్టీకి అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ పదవిని సీనియర్లకు కాకుండా యువనేతలకు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. వారైతేనే ఉత్సాహంగా పార్టీ అభివృద్ధికి పని చేస్తారని, పార్టీని బలోపేతం చేస్తారని అభిప్రాయపడుతున్నారట. అందుకే.. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పేరు పార్టీ అధ్యక్ష పదవికి, దివంగత నేత ఎర్రన్నాయుడు కొడుకు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి పేరు తెలుగు యువత అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే.. తెలుగు యువత అధ్యక్ష పదవి చేపట్టడానికి రామ్మోహన్‌నాయుడు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. తనకు శ్రీకాకుళం లోక్‌సభ ఎంపీ బాధ్యతలు ఉన్నందు వల్ల ఈ పదవికి న్యాయం చేయలేనని, మరెవరినైనా పరిశీలించాలని ఆయన అంటున్నారు. ఈ నెల 27వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును కూడా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాదని, రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను ప్రకటిస్తారని వివరించాయి.
ALso Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?
మొత్తంగా ఏపీలో పార్టీని నడిపించే ఓ లీడర్ కోసం టీడీపీలో వెతుకులాట ప్రారంభమైంది. సీనియర్లతో వేగలేమని గ్రహించిన చంద్రబాబు యువ నేతలకు అవకాశం ఇవ్వాలని తలుస్తున్నారు. మరి చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి, తెలుగు యువత పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.