కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేయడం కోసం దేశం మంతా దిగ్బంధనం పాటిస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రజల నుండి, ముఖ్యంగా యువత నుండి తగు సహకారం లభించక పోవడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు కష్టతరమవుతుంది. అందుకనే పలు చోట్ల లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు. నిషేదాజ్ఞలని అధిగమించి రోడ్లపైకి వస్తున్న వారిని తరమడంకోసం మంగళవారం పలు చోట్ల లాఠీచార్జీలు జరిపిన్నట్లు తెలుస్తున్నది.
దేశం అంతా అంతర్ రాష్ట్ర రాకపోకలను స్తంభింప చేయగా, సోమవారం రాత్రే పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులను మూసివేసిన ఏపీ ప్రభుత్వం మంగళవారం రాత్రి నుండి జిల్లాల మధ్య రాకపోకలను సహితం స్తంభింప చేసింది. దీనిని కఠినంగా పాటించాలని, ఆదేశాలను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. వాహనాలను సీజ్ చేస్తామని, వ్యక్తులపై కేసులు పెడతామని హెచ్చరించారు.
సోమవారం ఏపీతో సహా కొన్ని రాష్ట్రాలలో దిగ్బంధనాన్ని పాటించకుండా, ప్రజలు యథేచ్ఛగా రోడ్డులపై తిరుగుతూ ఉండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసహనం ప్రకటించడంతో పాటు, కేంద్ర హోమ్ కార్యదర్శి రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను పంపారు. దానితో ఏపీ పోలీసులు ఈ విషయమై సీరియస్ అయ్యారు. ఉదయం లాక్‌డౌన్ నిబంధనలను లెక్కచేయకుండా పలు చోట్ల ప్రజలు రోడ్లమీదకు వచ్చినవారిని వెంటాడారు.
నెల్లూరు, విజయవాడ, చిత్తూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో రోడ్ల పైకి వచ్చిన వారిని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.కొన్ని ప్రాంతాల్లో లాఠీలకు పని చెప్పారు. విజయవాడలో ఓ యువకుడిని అదుపు చేసేందుకు ఆరుగురు పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. చివరకు బలప్రయోగంతో అతడిని పంపించారు.
చిత్తూరు, నెల్లూరు, గుంటూరు పట్టణాల్లో వాహనదారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఒకటికి రెండుసార్లు తిరుగుతూ టాబ్లెట్ల కోసమని చెబుతున్న కొంతమంది యువకులను పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరోసారి దొరికితే బండి సీజ్ చేస్తామని హెచ్చరించారు.
విజయవాడ రామవరప్పాడు రింగు సెంటర్లో వాహనాలను అదుపు చేస్తున్న శ్రీధర్ అనే కానిస్టేబుల్‌ను క్వాలిస్ వాహనం ఢకొీట్టింది. అతనికి తీవ్రగాయాలు కావడంతో తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, టంగుటూరులో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పెదదోర్నాలలో వాహనదారులతో గుంజీలు తీయించారు.
గుంటూరులో 107 ఆటోలను సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.14.66 లక్షలు జరిమానా విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న 2300 మందిపై కేసులు నమోదు చేశారు. 288 వాహనాలను సీజ్ చేసినట్లు డిజిపి గౌతంసవాంగ్ తెలిపారు. విదేశాల నుండి వచ్చేవారు విధిగా పరీక్షలు చేయించుకోవాలని చెబుతూ, అవసరమైతే వారి పాస్‌పోర్టులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
విదేశాల నుండి వచ్చిన పలువురు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడంతో వారిని పట్టుకోవడం కోసం వెంటాడవలసి వస్తున్నది. గుంటూరు లోని శ్యామలానగర్ లో ఒక వ్యక్తిని రెండు రోజులపాటు కాపు కాస్తే గాని పటుట్కోలేక పోయారు.
విశాఖలో మూడు ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించారు. నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఉదయం తొమ్మిది గంటల వరకే అనుమతి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబజార్లు కిటకిటలాడాయి. విజయవాడలో పాజిటివ్ నమోదైన వ్యక్తి కుటుంబ సభ్యులకు నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా వారిని 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. .