
మెగాస్టార్ అభిమానులతో తన భావాలను పంచుకునేందుకు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఉగాది రోజున తన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెల్సిందే. మెగాస్టార్ అన్నట్లుగానే నేటి ఉదయం(బుధవారం) 11గంటల 11నిమిషాలకు ‘తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అంటూ తొలి ట్వీట్ చేశారు.
అలాగే మరో ట్వీట్ కరోనాపై చేశారు. నేడు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిని భారత్ నుంచి తరలిమేందుకు కలిసికట్టుగా పోరాడాలన్నారు. ‘ప్రతీఒక్కరూ ఇంటి పట్టునే ఉందాం.. సురక్షితంగా ఉందామంటూ’ మెగాస్టార్ పేర్కొన్నారు. దేశ ప్రధాని మోదీ చెప్పినట్లుగా 21 రోజులు మనమంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయనియంత్రణే శ్రీరామరక్ష అని చెప్పారు.
ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు, శ్రీ జగన్ గారు ఇచ్చే ఆదేశాలను పాటిద్దాం.. ఇంటి పట్టునే ఉందామని మరో ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, తన ప్రియమైన అభిమానులందరితో నేరుగా మాట్లాడగలగటం ఆనందంగా ఉందన్నారు.
మెగాస్టార్ ఎంట్రీతో మెగాస్టార్ ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. కొద్దినిమిషా వ్యవధిల్లోనే వేలసంఖ్యలో ఫాలోవర్స్ అయ్యారు. సిల్వర్ స్ర్కీన్ పై రికార్డులు సృష్టించిన మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీతో మరెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.