
ఏపీ గవర్నమెంట్ ఆస్తుల్ని అమ్మేస్తుంది. కొన్నింటిని తాకట్టు పెడుతోంది. ఖరీదైన ప్రాంతాల్లో కలెక్రరేట్లను కూడా వదిలిపెట్టడం లేదు. విశాఖపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు అమ్మడానికి నోటిఫికేషన్లు సిద్ధం చేసింది. ఇటీవల అప్పుల కోసం ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. గత ఏడాది మద్యంపై ఆదాయం అంతా సంస్థకు మళ్లించి రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చారు.
ఆ కార్పొరేషన్ నుంచి ఇంకా రుణాలు తీసుకోవాలంటే ఆ సంస్ధకు ఆస్తులు ఉండాలి. దీంతో ఆస్తులను సంస్థక బదిలీ చేయాల్సింది. ఇందుకు ఖరీదైన ఆస్తులను ఎంపిక చేశారు. వాటిలో దాదాపుగా మూడెకరాల్లో ఉన్న విశాఖ కలెక్టరేట్ నుంచి బక్కన్నపాలెంలోని వికలాంగుల శిక్షణ కేంద్రం వరకు చాలా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలున్నాయి.
ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, ఎకార్డ్ యూనివర్సిటీ కూడా తాకట్టు పెట్టే ఆస్తుల జాబితాలో ఉన్నాయి. వీటి తాకట్టుకు రూ.1600 కోట్లు అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తీరు చూసి విశాఖ ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎక్కడైనా సంపద సృష్టించి ఆ సంపదను అమ్మి ప్రజల ఆస్తుల విలువ పెంచుతుంది.
కానీ ప్రభుత్వం ఎప్పుడో నలభై యాభై ఏళ్ల కిందటి ప్రభుత్వాలు సమకూర్చి పెట్టిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టుకోవడం, అమ్ముకోవడం వంటివి చేయడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ఏమైనా ఉంటే కేసులు పెడతారేమోనన్న భయంతో చాలా మంది నోరు మెదపడం లేదు. విశాఖ వాసుల్లో మాత్రం అసంతృప్తి గూడుకట్టుకుంటోంది.