ప్రభుత్వ పనులు చేసే క్రమంలో అధికారులు బాధ్యులు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావును ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు సిఫార్సు చేసింది. దీంతో ఆయనను తొలగిస్తున్నట్లు రహస్య జీవో జారీ చేసినట్లు సమాచారం. ఏబీ వెంకటేశ్వర్ రావుపై ఆరోపణలు వస్తున్న క్రమంలో ఫైల్ రూపంలో కేంద్రానికి పంపించినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్వర్ రావు సస్పెన్షన్ లో ఉన్నారు. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లుగా గత ఏడాది ఫిబ్రవరిలోనే సస్పెండ్ చేశారు. ఈ కేసులో అవకతవకలపై విచారణ పూర్తి కాలేదు. కేసు సుప్రీంకోర్టులో ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సిసోడియా ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. నివేదికపై సుప్రీంకోర్టులో విచారణ జరగాలి. అయితే ఈ లోపు ఏపీ సర్కారు మరో అభియోగం మోపింది. ఆయన అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు సైతం పక్కన పెట్టారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఇటీవల ఎంక్వైరీస్ ఆఫ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా నియమించింది.
అయితే ఆయన సర్వీసులో ఉండేందుకు అనర్హుడని జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. రాష్ర్ట ప్రభుత్వం చేసిన సిఫార్సును అభియోగ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాక యూపీఎస్సీ అభిప్రాయం కూడా తీసుకుని కేంద్రం తన నిర్ణయం చెబుతుంది. అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారులను డిస్మిస్ చేయడం సాధారణం కాదు. పనితీరు బాగోలేకపోతే స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుంది. కానీ ఏబీవీపై ఆరోపణలు వచ్చినందున విచారణ పూర్తి కాకుండా ఏ నిర్ణయం తీసుకోరాదు.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఎందుకు తొందరపడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఓ వెలుగు వెలిగిన ఆయనకు వైసీపీ హయాంలోకనీసం పోస్టింగ్ దక్కకపోగా చివరికి రిటైరయ్యే ముందు సర్వీస్ పోగొట్టుకునే పరిస్తితి వచ్చిందని తెలుస్తోంది దీంతో ఆయన ఉద్యోగానికి ఎసరు రావడంపై అందరిలో చర్చనీయాంశం అవుతోంది.