రాష్ట్రంలో నేటి నుంచి పరిమితులతో కూడిన ఇసుక తవ్వకాలను చేపడుతున్నట్లు ఎపిఎండిసి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మదుసూధన్ రెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర హోం అఫైర్స్ డిపార్ట్ మెంట్ నుంచి గనులు, ఖనిజ రవాణా నిర్వహణపై వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తామని వెల్లడించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తగినన్ని ఇసుక నిల్వలను సమకూర్చుకోవడం కోసం ఎపిఎండిసి పనిచేస్తుందని తెలిపారు. కరోనా నియంత్రణ చర్యలకు విఘాతం కలగకుండా, అతితక్కువ సిబ్బందితో, యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా ఇసుక తవ్వకాలు సాగిస్తామని తెలిపారు. అలాగే ఈ పనుల్లో వుండే కార్మికులు, టెక్నీషియన్ల రక్షణార్థం సామాజికదూరం పాటించేలాగున, ముఖానికి మాస్క్ లు, చేతులు శుభ్రపరచుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా రానున్న వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని నిర్మాణరంగ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా వుండేందుకు గాను రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పాయింట్ లలో నిల్వ చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా ఎపిఎండిసి లాక్ డౌన్ సమయంలో స్టాక్ యార్డ్ లకు ఇసుకను అందిస్తుందని తెలిపారు. ఈ సమయంలో స్టాక్ యార్డులకు తప్ప మరేవిధమైన అమ్మకాలు చేపట్టబడవని తెలిపారు.