
Telangana Projects: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఏపీ వాగ్వాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇన్నాళ్లు మిత్రులుగా ఉన్న వారు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఈ పథకం పనులు చేపడుతోందని పేర్కొంది. దీంతో తెలంగాణ, ఏపీ లకు పర్యావరణ హాని కలుగుతుందని తెలిసినా పట్టించుకోవడం లేదని వాపోయింది.
జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తాగునీటి కోసం అని చెప్పి సాగునీటి అవసరాల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తోందని పేర్కొన్నారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో కేంద్రం వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వాదనపై తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు స్పందించారు. ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న అక్కసుతో ఎన్జీటీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. దీనిపై ఏపీ పలు వాదనలు చేస్తూ తప్పుదోవ పట్టించాలని చూస్తోందని విమర్శించారు. అయినా న్యాయం తమ పక్షమే ఉందని ఉద్ఘాటించారు.
న్యాయప్రకారంగా తాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టు పనులు చేపట్టామని, రెండో దశలో సాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు కోరామని, పర్యావరణ అనుమతులు వచ్చే వరకు సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని చెప్పారు. తెలంగాణ ఏ ప్రాజెక్టుల కోసం కూడా అనుమతులు తీసుకోలేదని ఏపీ వాదిస్తోంది. దీనిపై మరోసారి ఎన్జీటీకి వెళతామని చెబుతోంది.
తాగునీటి అవసరాలకైతే ఒక్క టీఎంసీ నీరు 5 లక్షల మందికి సరిపోతుందని కానీ 67 టీఎంసీల నీరు నిల్వ చేయడంలో అర్థమేమిటని ఏపీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం కలగజేసుకోవాలని కోరుతోంది. కేంద్రాన్ని మధ్యలోకి లాగుతూ దాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయినా తెలంగాణ ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించకుండా అన్ని న్యాయప్రకారమే చేస్తుందని రామందర్ రావు పేర్కొన్నారు.