CM Jagan Speech: జగన్ స్పీచ్ మారదా?

నగిరి లో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. ఆయన ఫోటో కే దండలు వేస్తున్నారని విమర్శలు చేశారు.

Written By: Dharma, Updated On : August 29, 2023 4:53 pm

CM Jagan Speech

Follow us on

CM Jagan Speech: ఏపీ సీఎం జగన్ ప్రసంగ శైలి మారడం లేదు. పాడిందే పాట అన్నట్టుంది. నోరు తెరిస్తే చంద్రబాబు పైనే ఆరోపణలు చేస్తున్నారు. అవి కూడా తరచూ చేసినవే. తానేం చేస్తున్నది.. ప్రజల కోసం ఏమేమి చేసానో చెప్పడం లేదు. గత తొమ్మిదేళ్లుగా ఏం చెబుతూ వస్తున్నారో .. ఇప్పుడు కూడా వాటినే కొనసాగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రానికి సీఎం అయి నాలుగు సంవత్సరాలు అవుతోందన్న విషయం మరిచిపోయి.. ఇప్పటికీ ప్రతిపక్షంలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. నోరు తెరిచింది మొదలు చంద్రబాబును ఆడిపోసుకుంటున్నారు.

నగిరి లో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. ఆయన ఫోటో కే దండలు వేస్తున్నారని విమర్శలు చేశారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనడాన్ని కూడా తప్పుపడుతున్నారు. అయితే చంద్రబాబు వెన్నుపోటును ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అటు తరువాత రెండు సార్లు సీఎం పోస్టులో చంద్రబాబును కూర్చోబెట్టారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్ధులు ఆరోపించినా.. ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. అధికారమిచ్చి తమ ఆమోదాన్ని తెలిపారు. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకొని జగన్ ఆరోపణలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చిత్తూరు జిల్లా అంగళ్లు లో జరిగిన అల్లర్ల విషయాన్ని ప్రస్తావించారు జగన్. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఆ ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. అయితే అందులో వాస్తవం ఉండవచ్చు కానీ.. చంద్రబాబు ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి అన్నది జగన్ కు తెలియంది కాదు. పోలీసులపై సైతం టిడిపి శ్రేణులు దాడులు చేశాయని.. ఇందులో ఒక పోలీస్ అధికారి కన్ను కూడా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీస్ శాఖ స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఏపీలో ఉందా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేరు. గత నాలుగేళ్లుగా జరిగిన ఘటనల్లో పోలీసుల పాత్ర, వ్యవహరించిన తీరు ఏపీ ప్రజలకు సుపరిచితమే.

మరోవైపు దొంగ ఓట్ల గురించి కూడా ప్రస్తావించారు. దొంగే దొంగ అన్న మాదిరిగా జగన్ వ్యవహార శైలి ఉంది. ఇందులో కూడా తప్పిదాన్ని చంద్రబాబు మెడకే చుడుతున్నారు. కానీ ఇప్పటికే ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో ఇద్దరు అధికారులు బాధ్యులయ్యారు. ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్కు దిగితే ఇంకా చాలామంది ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. వారంతా అధికార పార్టీ ఒత్తిడి లేకుండా ఆ పని చేశారా? పోనీ జగన్ చెబుతున్నట్టు ప్రతిపక్ష నేత చంద్రబాబు వారితో చేయించారా? అది సాధ్యమేనా? కానీ సీఎం జగన్ అదే పనిగా…అవే ఆరోపణలు చేస్తుండడాన్ని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు.