Thummala Nageswara Rao
Thummala Nageswara Rao: “కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. డీకే శివకుమార్ ఈ డీల్ కుదిరించారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు.” ఇవీ మొన్నటి వరకు షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సంబంధించి మీడియాలో విశేషంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా పరిస్థితి మారిపోయినట్లు సమాచారం. మొన్నటిదాకా పాలేరులో పోటీ చేస్తారు, క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభించారు, ఇక ఎన్నికల రంగంలోకి దిగడమే తరువాయి.. అనే తీరుగా షర్మిల అనుచరులు ప్రచారం చేశారు. అయితే ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు దృష్టిసారించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి ఈ స్థానంలో కందాల ఉపేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి.. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిలోకి చేరారు. ఇక ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పాలేరు స్థానాన్ని కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించారు.
తుమ్మల బల ప్రదర్శన
ఉపేందర్ రెడ్డి కి టికెట్ కేటాయించిన నేపథ్యంలో గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు భారత సమితి అధిష్టానం పై ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఇటీవల హైదరాబాద్ నుంచి పాలేరు నియోజకవర్గం వరకు బల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాలేరు స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే భారత రాష్ట్ర సమితి టికెట్ ఉపేందర్ రెడ్డికి కేటాయించిన నేపథ్యంలో.. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారతారు అని ఆరోపణలు ఉన్నాయి. ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ జెండాలతో ప్రదర్శన నిర్వహించడం, జై కాంగ్రెస్, జై తుమ్మల అంటూ నినాదాలు చేయడంతో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అనేది తేలిపోయింది. ఆ మధ్య రేణుకాచౌదరి ఖమ్మం వచ్చినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. అయితే తుమ్మల ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే పాలేరు స్థానాన్ని కచ్చితంగా ఆయనకే కేటాయిస్తారు. అలాంటప్పుడు షర్మిల భవితవ్యం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
అయితే డీకే శివకుమార్ తో చర్చలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాలనే చర్చ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి షర్మిల తాను సుముఖంగా లేనని సమాధానం చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా షర్మిల రాకను అంతగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీనికి తోడు షర్మిల పార్టీ విలీనం కూడా తాత్కాలికంగా నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ ప్రక్రియను మొత్తం అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అనే తీరుగా షర్మిల రాజకీయ ప్రస్థానం సాగుతున్న నేపథ్యంలో.. ఇంతకీ ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు ఆమె కేడర్ నుంచి వ్యక్తమవుతున్నాయి.