
వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో.. మంత్రివర్గంలో స్థానం ఆశించిన వారి సంఖ్య వంద మందికిపైనే ఉంది. కానీ.. తొలిసారి పాతిక మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకున్నారు జగన్. అయితే.. ఆశావహులు అందరినీ సైలెంట్ గా ఉంచడానికి ఓ మంత్రం వేశారు. ఆ మంత్రమే సగం పాలన. ఇప్పుడున్న మంత్రివర్గం సరిగ్గా రెండున్నర సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత మిగిలిన వారికి అవకాశం ఇస్తా అని చెప్పారు. దీంతో.. ఆశావహులకు ఎదురు చూపులు మొదలు పెట్టారు.
జగన్ పాలన చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక, ఆర్నెళ్లు ఆగితే తమ టైమ్ వస్తుందని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీంతో.. మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి? అనే చర్చ మొదలైంది. అయితే.. ఎంత పక్కాగా డీల్ చేసినా అందరికీ న్యాయం చేయడం అసాధ్యం అన్నది తెలిసిందే. అవసరమైన వారికి మంత్రి పదవులు ఇచ్చి, మిగిలిన వారికి రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతలు ఇస్తామని బుజ్జగించే ఛాన్స్ ఉంది. కానీ.. అంత మందిలో ఆ కొందరిని సెలక్ట్ చేయడం అనేది ఇబ్బందికరమే. అయితే.. జగన్ కు ఆ ఇబ్బందిని కరోనా తగ్గించిందనే చర్చ మొదలైంది.
మొదట్నుంచీ మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో చాలా మంది ప్రజల్లోనే ఉన్నామని అనిపించుకునేందుకు జనాల్లో ఉండి ఏవేవో కార్యక్రమాలు చేపట్టినట్టు ప్రచారం చేసుకునేవారు. వీరిలో కొందరు సోషల్ మీడియా వేదికగా ఫోకస్ అయ్యేందుకు ప్రయత్నించారు. కొవిడ్ తొలి దశలో అంతో ఇంతో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టుగా కనిపించారు. కానీ.. సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.
మెజారిటీ శాసనసభ్యులు ఇళ్లకే పరిమితం అయ్యారు. జనం గోడు పట్టించుకోవడం ఎప్పుడో వదిలేశారు. తాము వైరస్ బారిన పడకుండా చూసుకుంటే అదే పదివేలు అన్నట్టుగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అతి కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే జనాలకు అంతో ఇంతో సహకారం అందిచేందుకు ముందుకు వస్తున్నారు. వాళ్లుకూడా స్వీయ రక్షణకు ప్రాధాన్యమిస్తూనే.. జనాలకు కాస్త సేవ చేసేందుకు చూస్తున్నారు.
ఇలాంటి వారికే వచ్చే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో స్థానం లభిస్తుందని అంటున్నారు. జగన్ సైతం ఇదే తరహా ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. మిగిలిన వారికి కారణం చూపించడానికి కూడా కరోనా సేవ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. మరి, ఇందులో వాస్తవం ఎంత ఉంది? అన్నది చూడాలి.