పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకత్తాకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు నిరసనలతో స్వాగతం లభించింది. వారి రాకకు వ్యతిరేకిస్తూ నలుపు బెలూన్లతో వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్రానిదే బాధ్యత అని, హోమంత్రి పదవి నుంచి అమిత్ షా తప్పుకోవాలంటూ నినాదాలు చేశారు.
త్వరలో జరుగనున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిఏఏ అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా “మరింకా అన్యాయం వద్దు” (ఆర్ నోయ్ అన్నాయ్) పేరుతో కార్యక్రమాలను ప్రారంభించడానికి వారు కలకత్తాకు చేరుకున్నారు. సిఏఏ విషయమై పశ్చిమ బెంగాల్ బిజెపి లో విబేధాలు నెలకొన్నాయన్న కధనాల నేపథ్యంలో వారి రాక ప్రాధాన్యత సంతరింప చేసుకోంది.
వామపక్ష విద్యార్థి సంఘాలు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్ సమీపానికి చేరుకున్నారు. అమిత్ షా ఎయిర్‌పోర్టుకు చేరకున్నారన్న విషయం తెలియగానే నలుపు బెలూన్లు ఆకాశం వైపు ఎగురవేసి, అమిత్ షా గోబ్యాక్ అంటూ ఫ్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఒక్క వామపక్ష పార్టీలే కాకుండా ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, రాజకీయేతర సంఘాలు అన్ని నిరసనలో పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఢిల్లీ అల్లర్లకు కారణం బీజేపీయేనని, మతతత్వంతో చేలరేగిన అల్లర్లకు అగ్గి రాజేసింది అమిత్ షాయేనని వారు ఆరోపించారు.
పైగా, వారి రాకకు ఒకరోజు ముందే శనివారం ప్రముఖ బెంగాలీ నటి సుభద్రా ముఖేర్జీ బిజెపికి రాజీనామా చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్ల సందర్భంగా పలువురు బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వారిపై ఎటువంటి చర్య తీసుకొనక పోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రా వంటి వ్యక్తులు ఉన్న పార్టీలో తాను ఉండలేనని ఆమె స్పష్టం చేశారు.