Anti-Indians: ఎవరో వస్తున్నారు. ఉన్నట్టుండి కాల్పులు జరుపుతున్నారు. ఎవడో చస్తున్నాడు. ఆ చచ్చిన వాడి గురించి ఆరా తీస్తే.. వాడు ఉగ్రవాది అని తేలుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవాడని తెలుస్తోంది. ఇప్పటికి ఇలాంటి ఉగ్రవాదులు ఐదుగురు అత్యంత అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఆరోవాడు చేరాడు.. అయితే ఈ ఆరు హత్యలు కూడా పాకిస్తాన్, ఇతర దేశాల్లో జరగడం విశేషం. గతంలో భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగేవి. దేశంలో ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లు సంభవించేవి. ప్రాణనష్టం జరిగేది, ఆస్తి నష్టం జరిగేది. అన్ని వేళ్ళూ పాక్ వైపు చూపిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం ఏర్పడేది. ఒకానొక సందర్భంలో మన సైన్యాన్ని, వ్యవస్థల్ని చులకనగా చూసే దుస్థితి ఎదురయ్యేది.
కానీ, ఇప్పుడు భారత్ తన వ్యతిరేక శక్తుల్ని ఎటువంటి యుద్ధం చేయకుండానే శాశ్వతంగా నిరోధించగలుగుతోంది. దీనికి తెర వెనుక “రా”కృషి చేస్తోంది అనే వాదనలు ఉన్నాయి. గతంతో పోలిస్తే భారతదేశానికి చెందిన గూడ చర్య సంస్థ మరింత బలోపేతమైంది. కేంద్ర జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో కనివిని ఎరుగని స్థాయిలో రా బృందం విజయాలు సాధిస్తున్నది నిజ్జర్ ఉదంతం తో మొదలు పెడితే చాలా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక తాజాగా మన దాయాది దేశం పాకిస్తాన్ లో లష్కరే_ఈ తోయిబా అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడు కైజర్ ఫరూఖ్ ప్రత్యర్థి వర్గం జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. కరాచీలో తన ఆరుగురు సభ్యులతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా ప్రత్యర్థి వర్గం వాళ్లు కాల్పులు జరపడంతో అతడు అక్కడికి అక్కడే చనిపోయాడు. ఆ కాల్పులు జరిపిన వాళ్లు కైజర్ బృందంలోని మిగతా సభ్యులను ఏమీ చేయకపోవడం విశేషం. ఈ కైజర్ భారత్ లోని ముంబై పేలుళ్లు, ఇతర ఉగ్రవాద ఘటనల్లో కీలకంగా వ్యవహరించాడు. అయితే పాకిస్తాన్ దేశంలో భారత్ వ్యతిరేకులు ఒక్కొక్కరుగా చనిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే పాకిస్తాన్ దేశంలో తీవ్ర దారిద్రం అలముకున్న నేపథ్యంలో రా బృందం చాలా తెలివిగా భారత్ వ్యతిరేకులను మట్టు పెట్టిస్తోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ భారత గూడచార్య సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు, దానికి మోడీ అందిస్తున్న సహకారం వల్ల ప్రపంచ యవనిక పై సరికొత్త చరిత్ర నమోదవుతోంది.