BRS- Anti-BJP Parties: బీజేపీతో ఏర్పడిన విభేదాల కారణంగా మోదీని, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ కొన్నాళ్లు బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యతకు పనిచేశారు. కానీ అవి ఫలించలేదు. దీంతో సొంతంగా జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు దసరా రోజు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. అయితే జాతీయ రాజకీయాల హడావుడి కేవలం సీఎం కేసీఆర్ కే పరిమితమైనట్లుగా కనబడుతోంది. ఆయన బీఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా స్పందన రవడం లేదు. బీఆర్‌ఎస్ ను ప్రకటించగానే వివిధ రాష్ట్రాలలోని నాయకులు పరుగులు తీస్తూ తన దగ్గరకు వస్తారని కేసీఆర్ భావించారు. కానీ కేసీఆర్ దగ్గరకు వచ్చి కలుసుకొని మాట్లాడింది కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రమే.

ఢిల్లీలో ఒంటరిగా కేసీఆర్..
కొంత కాలం కిందట రైతు నాయకుల పేరుతో ఉత్తరాది నుంచి వచ్చి కొందరు హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. అప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ తెగ ఊగిపోయారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేయడానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నానని తెలిపారు. రైతు నాయకులు తనను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారని కూడా ప్రకటించారు. ఇక, బీఆర్‌ఎస్ పార్టీతో కలిసి నడవడానికి దేశవ్యాప్తంగా చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని విజయదశమి రోజు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఏ పార్టీ ముందుకు వచ్చినట్లు కనబడటంలేదు. కేసీఆర్ ఆవేశానికి, అంచనాకు తగిన దృశ్యం కనబడటంలేదు. బీఆర్‌ఎస్ ప్రకటన తరువాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా ఆయన్ని కలుసుకోవడానికి ఏ ఒక్క రైతు నాయకుడు ఆనీ, బీజేపీ వ్యతిరేక పార్టీ నాయకులు గానీ రాలేదు.
మూడు రోజులైనా.. ఢిల్లీలోనే..
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయన్‌సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అటు నుంచి అటే తన కూతురు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్‌రావును వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్ అక్కడ ఎవరితోనూ మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. మీడియా సమావేశం పెడతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అది కూడా లేదు. బీఆర్‌ఎస్ గురించి ఆయన నోటి నుంచి ప్రజలకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కేసీఆర్ ఎందుకీ గోప్యత పాటిస్తున్నారు? మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వెనుక రహస్యం ఏమిటి అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఎందుకింత గోప్యత పాటిస్తున్నారన్నది టీఆర్‌ఎస్ వర్గాలకు కూడా అంతు చిక్కడం లేదు.
ఈసీ అనుమతి ఇచ్చాకే..
భారత్ రాష్ట్ర సమితికి ఈసీ ఆమోదం తెలిపిన తర్వాత కేసీఆర్ అందరికీ క్లారిటీ ఇస్తారని.. ఇంకా అధికారికంగా పేరు మారకుండానే అన్నీ చెప్పడం మంచిది కాదని ఆగినట్లుగా టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇపుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ సాధ్యమా? ఒక బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ‘తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ’ నుంచి బయటపడి జాతీయ నాయకుడిగా ఇతర ప్రాంతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందగలరా? అనే చర్చ మొదలైంది.
కూతురును కాపాడేందుకు మునుగోడు తాకట్టు?
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్న తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌లో మోదీపై, అమిత్‌షాపై నోరు పారేసుకునే కేసీఆర్ ఇప్పుడు తన కూతురు కోసం వారిని శరణు కోరే పనిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. లేదంటే బోయినపల్లి అభిషేక్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ ఆపాలని కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కవితను తప్పిస్తే మునుగోడులో బీజేపీ గెలుపునకు సహకరిస్తానని కూడా కేసీఆర్ బీజేపీ పెద్దలకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఎన్నికలను వదిలి ఢిల్లీలో మకాం వేశారన్న చర్చ జరుగుతోంది.

కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘బూర’
మరోవైపు టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్యగౌడ్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగానే నర్సయ్యగడ్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ ఆఫీస్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మొత్తంగా ఢిల్లీలో ఏదో జరుగుతుందన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది.