Peetadhipathi Political Entry: ఎప్పుడూ ఆధ్యాత్మిక సేవలో ఉండే కొందరు పీఠాధిపతులు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే రాజకీయాలకు పీఠాధిపతుల లింకు ఈనాటిది కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలు విశాఖ శారదాపీఠాధిపతి అనుమతి లేకుండా అడుగు కూడా బయటపెట్టరన్న ప్రచారం ఉంది. వారిద్దరు గెలుపు కోసం ఎన్నోరకాల హోమాలు, పూజలు చేశారు. అటు స్వామిజీగారి పూజల అనుసారంతో పాటు ప్రజల నుంచి అనుగ్రహం పొందడంతో వారు విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రజల విషయం పక్కనపెడితే.. తమ విజయానికి కారకుడైన విశాఖ శారదా పీఠాధిపతి సేవలో మాత్రం నిత్యం తరిస్తుంటారు. స్వామిజీ గారి ఎటువంటి కోరిక కోరినా ఇట్టే తీర్చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ అయితే భూ సంతర్పణ సైతం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోనీ ప్రభుత్వ పెద్దల పూజల వరకూ పర్వాలేదు కానీ.. కొందరు పీఠాధిపతులు నేరుగా రాజకీయాల్లోకి రావాలని చూస్తుండడం ఏపీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

ప్రస్తుతం హిందూ ప్రచారంలో ముందున్న ఓ పీఠాధిపతి బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. తనకు ఎంపీ కావాలని ఉందని చాలాసార్లు తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించారు కూడా. అయితే అది బీజేపీ ద్వారా అయితే సాధ్యం కాదన్న నిశ్చయానికి అయితే వచ్చారు. అలాగని వైసీపీలోకి వెళదామంటే ఎక్కడా ఖాళీలు లేవు. గతంలో టీడీపీతో విభేదాలుండడంతో ఆ పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆయన జనసేన వైపు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీఠాధిపతికి మంచి గుర్తింపే ఉంది. హిందూ మత ప్రచారంలో ముందుంటారు. హిందూ మత వ్యాప్తికి, ఎక్కడైనా హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఘటనలు జరిగితే ఇట్టే వాలిపోతారు. అయితే దీని వెనుక మాత్రం ఆయన పొలిటికల్ అజెండా ఉందన్న ఆరోపణలున్నాయి. అయితే ఎంపీ కావాలనుకున్న తన జీవిత ఆశయానికి రెండు సంవత్సరాలముందే పదును పెట్టారు. తన కేస్ట్ వారు అధికంగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. కానీ బీజేపీ అయితే నెగ్గుకు రాలేనని భయపడుతున్నారు. అందుకే జనసేన వైపు చూస్తున్నారు.

ఏపీలో జనసేన గ్రాఫ్ పెరిగింది. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వనని చెప్పడం ద్వారా పొత్తు ఉంటుందని పవన్ సంకేతాలిచ్చారు. దీంతో జనసేన వైపు నేతలు క్యూ కడుతున్నారు. పనిలో పనిగా సదరు పీఠాధిపతి కూడా తన మనసులో ఉన్న మాటను జనసేన హైకమాండ్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ మాత్రం లభించలేదు. పోనీ తన జీవితాశయం ఎంపీగానైనా కాకుండా.. కనీసం ఎమ్మెల్యే చాన్స్ అయినా ఇప్పించాలని జనసేన నేతలకు స్వామిజీ ప్రాధేయపడుతున్నారుట. పైగా పీఠాధిపతి అంతటి వారే అడిగేసరికి పోనీలే చూద్దామంటూ జన సేన నేతలు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో తన సామాజికవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్న స్వామిజీ తానే నెక్స్ట్ ఎమ్మెల్యేక్యాండిడేట్ ను అంటూ ప్రచారం చేసుకుంటున్నారట.