
ఏపీ సీఎం వైఎస్ జగన్ రైతుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ జలకళ, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చేసిన జగన్ ఇకపై రైతుల ఇంటికే ఎరువులు చేరేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ నిన్న కేంద్ర మంత్రులతో కలిసి పీఓఎస్ వెర్షన్, ఎస్‌ఎంఎస్ సర్వీసును ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎరువులు కొనుగోలు చేసిన రైతులు ఎరువులు డోర్ డెలివరీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు మెసేజ్ ల రూపంలో డెలివరీకి సంబంధించిన సమాచారం అందుతుంది. రైతులకు సాగు ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని.. నాణ్యత ఉన్న విత్తనాలు, ఎరువులను వాడటం వల్ల రైతులు గతంతో పోలిస్తే ఎక్కువ ఉత్పత్తిని సాధించగలుగుతారని సీఎం జగన్ చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 10,641 రైతుభరోసా కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చామని.. ఆర్బీకే కేంద్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వారిని, వ్యవసాయ సహాయకులను నియమించామని వాళ్ల ద్వారా రైతులు వారికి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని వెల్లడించారు. ఆర్బీకే కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణను కూడా అందిస్తామని వెల్లడించారు. డిజిటల్ కియోస్క్‌ల ద్వారా విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తే 24 గంటల నుంచి 48 గంటల్లోగా డోర్ డెలివరీ అవుతాయని చెప్పారు. స్మార్ట్ టీవీల ద్వారా రైతులకు పురుగు మందుల వాడకం మరియు విత్తనాలకు సంబంధించి శిక్షణ ఇస్తామని వెల్లడించారు.