దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మరో నిర్భయ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో జరిగిన నిర్భయ ఉదంతంతో దేశం యావత్తు ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే. అప్పుడు జరిగిన దారుణ ఘటనకు దేశం నివాళి అర్పించింది. దీంతో మహిళలపై జరిగే ఆకృత్యాలకు అడ్డు కట్ట వేయాలని న్యాయస్థానాలు సైతం ఘోషించాయి. వారం రోజుల క్రితం ఢిల్లీలో ఓ దళిత కుటుంబానికి చెెందిన బాలికను నలుగురు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. తరువాత తల్లిదండ్రులకు తెలియకుండానే ఖననం చేశారు. విషయం బయటకు పొక్కడంతో గొడవ మొదలైంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం పరామర్శించి ఇండియాకీ భేటీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ మాత్రం ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శిస్తోంది. ఓ దారుణమైన ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తోంది. బాలిక వివరాలు తెలిసేలా రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంపై ఆక్షేపించింది. బాలిక కుటుంబంపై కావాలనే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టింది. ట్విటర్ కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను సైతం స్తంభింపచేసింది. దీంతో ఢిల్లీలో పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది.
బాలిక కుటుంబం ఫొటోలను రాహుల్ గాంధీ తోపాటు బీజేపీ నాయకులు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ సభ్యులు కూడా ట్విటర్ లో పెట్టారు. కానీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఆయనపై విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలపై మరోసారి చర్చకు వస్తోంది. యూపీ నుంచి మొదలుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న లైంగిక దాడులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
దీంతో బీజేపీ సైతం దీటుగానే స్పందిస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన నిర్భయ హత్యపై ఎందుకు మౌనం వహించిందని దుయ్యబడుతున్నారు. ప్రభుత్వాలేవైనా ఆకృత్యాలు చోటుచేసుకోవడం మామూలే అనే విషయం తెలుసుకోకుండా రాద్దాంతం చేయడంపై బీజేపీ మండిపడుతోంది. రాహుల్ గాంధీ రాజకీయాల కోసమే ఈ ఉదంతాన్ని పెద్దదిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.