Homeఆంధ్రప్రదేశ్‌Maharaja District Hospital: ఏపీలో మరో పేరు మార్పు వివాదం.. ఈసారి టీడీపీ కీలక నేత...

Maharaja District Hospital: ఏపీలో మరో పేరు మార్పు వివాదం.. ఈసారి టీడీపీ కీలక నేత టార్గెట్

Maharaja District Hospital: ప్రభుత్వ సంస్థలకు ప్రముఖుల పేర్లు మార్చేంతవరకూ జగన్ సర్కారుకు నిద్రపట్టడం లేదు. విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుమారం మరువక ముందే… విజయనగరంలో మహారాజ కేంద్ర ఆస్పత్రి పేరు మార్చేశారు. గురువారం రాత్రికి రాత్రే మహారాజ పేరు తీసి.. ప్రభుత్వ సర్వజన ఆస్ప్రతిగా నామకరణం చేశారు. ఇప్పుడిది వివాదస్పదమవుతోంది. మహారాజ పేరు మార్పుపై నిరసనలు పెల్లబికుతున్నాయి. అన్నివర్గాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో విజయనగరం గజపతిరాజులది ప్రత్యేక స్థానం. ప్రజా సంక్షేమం కోసం వేలాది ఎకరాలను వదులుకున్న చరిత్ర వారిది. ఇప్పటికీ రాజవంశీయులు తమ ఆస్తులను, భవనాలను స్వచ్ఛంద సంస్థలకు, విద్యాలయాలకు రూపాయి అద్దెకు ఇస్తున్నారంటే వారి త్యాగనిరతిని అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ఉదారంగా భూములను ఇచ్చారు. అటువంటి రాజుల చరిత్రను తెలుసుకోకుండా మహారాజ కేంద్ర ఆస్పత్రి పేరు మార్చడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నారు.

Maharaja District Hospital
Maharaja District Hospital

1983లో జిల్లా కేంద్రాస్పత్రికి పూసపాటి రాజవంశీయులు 17 ఎకరాల భూమిని కేటాయించారు. నాటి ఎన్టీఆర్ సర్కారు ఆస్పత్రి భవనాలను నిర్మించింది. అప్పటి నుంచి మహారాజ జిల్లా కేంద్ర ఆస్పత్రిగానే కొనసాగుతోంది. గత నాలుగు దశబ్దాలుగా ఏ ప్రభుత్వం పేరు మార్చేందుకు సాహసించలేదు. కానీ జగన్ సర్కారు మాత్రం పేరు మార్చి కొత్త అపవాదును మూటగట్టుకుంది. ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోఇదే పెద్దాస్పత్రి. ఈ ఆస్పత్రి ప్రాంగణంలోనే డీఎంహెచ్ వో కార్యాలయంతో పాటు అనుబంధ ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. అయితే ఉన్నట్టుండి రాత్రికి రాత్రే పేరు మార్చేశారు. స్థానిక అధికారులు దీనిపై నోరు మెదపడం లేదు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వర్గాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పేరు మార్చినట్టు చెబుతున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నాయి.

Maharaja District Hospital
Maharaja District Hospital

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యారో సభ్యుడు అశోక్ గజపతిరాజును టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపై కన్నేసింది. అటు సింహాచలం దేవస్థానం భూములపై కూడా ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. అందుకే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పదవుల నుంచి రాత్రికి రాత్రే అశోక్ ను తెప్పించింది. బైలాకు విరుద్ధంగా అశోక్ సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు ను తెరపైకి తెచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా దొడ్డిదారిన నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అటు తరువాత ఎప్పటి నుంచో ఎయిడెడ్ విద్యాసంస్థలుగా కొనసాగుతున్న ఎమ్మార్ కాలేజీలతో పాటు ఇతర విద్యాసంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో అశోక్ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ కోర్టు ఆదేశాలివ్వడంతో తిరిగి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా నియమించబడ్డారు. ఇప్పుడు మరోసారి అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసుకుంటూ మహారాజ జిల్లా కేంద్ర ఆస్పత్రిగా పేరు మార్చడానికి ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. వివాదం మరింత జఠిలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular