https://oktelugu.com/

YCP MLA: వైసీపీని వీడనున్న మరో ఎమ్మెల్యే?

ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. పేరుకే ఎమ్మెల్యే కానీ.. కనీస గౌరవం దక్కడం లేదన్న బాధ ఆయన వెంటాడుతోంది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం.

Written By:
  • Dharma
  • , Updated On : November 3, 2023 / 06:37 PM IST
    Follow us on

    YCP MLA: వైసీపీలో మరో కీలక వికెట్ పడనుందా? ఓ ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారా? త్వరలో నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు సైతం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. హై కమాండ్ తీరు నచ్చక ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ పార్టీ మారనున్నారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ తరుణంలో దర్శి ఎమ్మెల్యే పార్టీ మారడం పక్కా అని వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తుండడం విశేషం.

    ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. పేరుకే ఎమ్మెల్యే కానీ.. కనీస గౌరవం దక్కడం లేదన్న బాధ ఆయన వెంటాడుతోంది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం. ప్రస్తుతం శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను ఎంతగా తొక్కలో.. అంతలా తొక్కుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి జగన్ సహకారం ఉందన్న టాక్ నడుస్తోంది. అందుకే పార్టీని వేయడమే మంచిదని వేణుగోపాల్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అందుకే ఇటీవల ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం మానేశారు. అటు హై కమాండ్ సైతం పట్టించుకోకపోవడంతో… వేణుగోపాల్ ను వదులుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వెంకాయమ్మ ఉండడంతో.. ఆమె కుమారుడు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దీనిపై గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే వేణుగోపాల్ కీనుక వహించిన హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా నియోజకవర్గంలో ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకుంటున్న శివప్రసాద్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వేణుగోపాల్ కు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్ర నేతల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావిస్తే వేణుగోపాల్ కు ఎటువంటి భరోసా దక్కలేదని తెలుస్తోంది. పైగా నియోజకవర్గంలో ప్రభుత్వపరంగా ఎటువంటి కార్యక్రమాలు, కీలక అధికారుల బదిలీలు అన్నీ శివప్రసాద్ రెడ్డి సిఫారసులకు లోబడే జరుగుతుండడంతో వేణుగోపాల్ మనస్థాపంతో ఉన్నారు.

    ప్రస్తుతం ఎమ్మెల్యే వేణుగోపాల్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్గంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే బాలినేని పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. తనతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరో ఎమ్మెల్యేని టిడిపిలోకి తీసుకెళ్తారని ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. అది మద్దిశెట్టి వేణుగోపాలే నని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఒకవేళ బాలినేని వైసీపీలో కొనసాగదలుచుకున్నా… ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాత్రం టిడిపిలోకి వెళ్లడం పక్కా అని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టిడిపి నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అన్నీ కుదిరితే జనవరిలోనే ఆయన టిడిపిలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి.