ఇప్పటికే ఏపీ హైకోర్టులో అక్కడి ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలకు స్టే విధించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం అమలులోకి రాకుండా మరోసారి హైకోర్టు స్టే విధించింది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలా స్టే ఆర్డర్లు వచ్చాయి. కానీ ఈ సారి వచ్చిన ఆర్డర్ మాత్రం ప్రభుత్వంతో పాటు, ప్రజల్ని కూడా నిరాశలో నెట్టేసేలా ఉంది. ఈ స్టే ఆర్డర్‌తో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం సంబరపడుతున్నాయి.
Also Read: జేసి రెడ్డప్ప పని పడుతున్న జగన్. వ్యాపారాలను దెబ్బతీయడమే టార్గెటా?
ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓ కమిషన్ వేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘చైనా’ బ్యాచ్‌తోపాటు ఇతర ప్రైవేటు స్కూల్స్ తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేశాయి. వైసీపీ రాకతో ఈ వ్యాపారానికి బ్రేక్ పడుతుందని ఆశించగా.. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. చైర్మన్ రెడ్డి కాంతారావు నేతృత్వంలో పలు దఫాలు సమావేశాలు కూడా జరిగాయి. రాష్ట్రంలోని ప్రతీ ప్రైవేట్ పాఠశాలను సందర్శించి, అక్కడ ఉన్న వసతులు, విద్యా నాణ్యత ఆధారంగానే ఫీజులు నిర్ణయించాలని భావించింది.
దీనిపై ప్రభుత్వం కూడా ఓ జీవో విడుదల చేసింది. ఇకపై ఫీజులు, ఇతరాలు లెక్కలన్నీ కమిషన్ దృష్టికి తీసుకురావాలంది. ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల నియామకాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. ప్రభుత్వ సిలబస్‌ను కచ్చితంగా పాటించాలని, ఏ స్కూల్‌కు ఆ స్కూల్ తమకు నచ్చిన సిలబస్ చెప్పుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పింది.
Also Read: ఏపీపై ఆర్‌ఎస్‌ఎస్ ఫోకస్..మతలబు ఏంటి?
ఈ నిర్ణయాలన్నీ అమలులోకి తీసుకువద్దామని ప్రభుత్వం అనుకుంటున్న టైంలోనే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. కమిషన్ పేరుతో ప్రభుత్వం తమపై ఆధిపత్యం చెలాయించడం కుదరదని, తమ ఫీజులు తామే నిర్ణయించుకుంటామని, ఫీజులు తగ్గిస్తే.. విద్యా ప్రమాణాలు పడిపోతాయని కుంటి సాకులు చెబుతూ ప్రైవేటు స్కూల్స్ కోర్టుని ఆశ్రయించడంతో పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు.. ఫీజుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యకలాపాలపై తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి.
హైకోర్టు ఇప్పటివరకు ఇస్తున్న స్టే ఆర్డర్లతో కేవలం ప్రభుత్వం మాత్రమే ఇబ్బంది పడుతూ వచ్చింది. కానీ.. ఈ స్టే ఆర్డర్‌తో అటు ప్రభుత్వంతోపాటు ఇటు పేరెంట్స్ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కమిషన్ కార్యకలాపాలు అమల్లోకి వస్తే ఫీజుల భారం తగ్గుతుందని సంబురపడ్డ పేరెంట్స్‌కు ఇది అశనిపాతంగా మారింది.