Telangana Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ జోష్‌ను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. ఈమేరకు ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణలో గతం కంటే మరో నాలుగు స్థానాలు అదనంగా గెలవాలని భావిస్తోంది. ఈమేరకు విజయ సంకల్పయాత్రలు ప్రారంభించింది. ఇక పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ఇప్పటికీ తెలంగాణలో పాజిటివ్ టాక్ రావడం లేదు. అయినా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాడర్‌లో జోష్ నింపేందుకు శ్రమిస్తున్నారు. ఒకవైపు వాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో పడకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరోవైపు నాయకులు అధికార పార్టీవైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన సీఎం
తెలంగాణలో మూడు పార్టీలు ఎవరికివారు మెజారిటీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎంపీ టికెట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. నారాయణపేట జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బుధవారం పర్యటించారు. కోస్గి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. సొంత నియోజకవర్గానికి వరాలు కురిపించారు. తెలంగాణలోనే కాదు దేశంలోనూ ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి తెలంగాణ నుంచే అడుగు పడాలని కోరారు.
సీఎంకే ఆ అధికారం..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సంప్రదాయానికి భిన్నంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం పార్టీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది. సాధాణంగా పీసీసీ పంపిన జాబితా ప్రకారం కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అధిష్టానం రేవంత్‌కు ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఫ్రీడం ఇచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. కొందరు సీఎం అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడు సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ ధైర్యంతోనే రేవంత్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. సౌమ్యుడిగా పేరున్న వంశీచందర్‌రెడ్డిని ప్రకటించడంపై అధిష్టానం కూడా అభ్యంతరం చెప్పదన్న భావనతోనే సీఎం ఆయన పేరు ప్రకటించి ఉంటారని సమాచారం.