AP Cabinet Expansion: ఆ మంత్రి రూటే సెపరేటు. మహిళలతో మాట్టాడిన మాటలు ఆడియో రూపంలో బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయినా ఆయనలో ఏ బెరుకూ లేదు. ఏ భయమూ లేదు. కానీ కొత్తగా ఆయనకు మంత్రివర్గం విస్తరణ భయం పట్టుకుంది. ఉద్వాసన తప్పదని భావిస్తున్న ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయనే విశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు. 2019 ఎన్నికల ముందు టీడీపీ గూటి నుంచి వైసీపీలోకి చేరిన ఆయనకు జగన్ తన కేబినెట్లో చోటు కల్పించారు. మాజీ మంత్రి గంటా బ్యాచ్ లో ఈయనా ఒకరు.
ప్రజారాజ్యం పార్టీ నుంచే వీరంతా ఓ టీమ్ గా పనిచేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రిగా, అవంతి శ్రీనివాసరావు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఎంపీగా పదవిలో ఉన్నప్పుడే అవంతి వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్లిపోయారు. ముందుగా కర్చిఫ్ వేసుకున్నారు. అయితే గంటాను మాత్రం అక్కడి నేతలు అడ్డుకుంటూ వచ్చారు. లక్ బాగుండి వైసీపీలో అవంతి చేరడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడం, అవంతి మంత్రి అయిపోవడం జరిగిపోయింది. ఇలా మూడేళ్లు గడిచిపోయింది. తాజా పరిణామాలతో అవంతి శ్రీనివాస్ కు కొత్త బెంగ పట్టుకుంది. మంత్రి పదవి పోతే తన పరిస్థితి ఏమిటని ఆయన మదనపడిపోతున్నారు.
Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. స్వరూపాలు.. అతిచిన్న జిల్లాకు ‘పర్యాటకం’ దూరం
పదవిలో ఉన్నంత కాలం జిల్లాలో ఇతర నాయకులను పట్టించుకోలేదు. పైగా పార్టీలోకి వచ్చిన కొద్దిరోజుల వ్యవధిలోనే మంత్రి పదవి కొట్టేశారని ఆయన సహచరులు తెగ బాధపడుతున్నారు. పోనీ మంత్రిగా తన మార్కు చూపించుకున్నారంటే అదీ లేదు. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి నీడలో తన ముద్ర చూపించుకోలేకపోయారు. పేరుకే మంత్రి కానీ.. అన్నీ విజయసాయిరెడ్డి చక్కదిద్దడంతో మంత్రి అవంతికి పని లేకుండా పోయింది. ఇప్పడు మంత్రి పదవి పోతే సహచరుల దగ్గర చులకన అవుతానన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. అలాగని గంటా బ్యాచ్ లోకి వెళ్లిపోదామంటూ గత మూడేళ్లుగా అనరాని మాటలతో వారి మనసును గాయపరిచారు. దీంతో ఏం చేయాలో మంత్రి అవంతికి పాలుపోవడం లేదట.
ఆది నుంచీ వివాదాలే
అసలు వచ్చే ఎన్నికల్లో మంత్రి అవంతి శ్రీనివాసరావుకు అసలు వైసీపీ టిక్కెట్ వచ్చే అవకాశమే లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో అధిష్టానం ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తికి తెరపైకి తెచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు మళ్లీ గురువు సాయంతో లాబీయింగ్ జరిపి టీడీపీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తారా? అన్నది ఇప్పుడొక సంశయాత్మకంగా ఉంది. ఎందుకంటే అవంతి గంటా ఇద్దరూ గతంలో టీడీపీ హయాంలో చక్రం తిప్పిన వారే! మామూలుగా కాదు ఓ రేంజ్ లో విశాఖ పాలిటిక్స్ ను ప్రభావితం చేసిన వారే! మరియు చేస్తున్న వారే ! ఇక రానున్న కాలంలో ఆయనకు మళ్లీ రాజకీయ ప్రాధాన్యం ఉండదని తెలుస్తోంది.మంత్రి పదవి ఉన్నా సాయి రెడ్డి హవా కారణంగా మొన్నటి దాకా చాలా ఇబ్బంది పడ్డారు.
అదేవిధంగా ఆయన తోటి ప్రజాప్రతినిధులను కూడా కలుపుకుని పోరు అన్న వాదన కూడా ఉంది. ముఖ్యంగా సాయిరెడ్డి వ్యూహంలో భాగంగా అవంతి పెద్దగా ఎదగలేకపోయారు. గంటా శ్రీను ను ఇటుగా రానివ్వలేదు సరికదా ఇక్కడున్న అవంతిని కూడా ఎదగనివ్వలేదు సాయిరెడ్డి. ఆ విధంగా ఆ ఇద్దరూ ఇప్పుడు రాజకీయ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు.ఈ దశలో మంత్రి అవంతి మరో మారు వివాదంలో చిక్కుకున్నారు. ఓ కీలక ఫైల్ విషయమై ఆయన చాంబర్లో ఇద్దరు అధికారులు బాహాబాహికి దిగడం ప్రతిష్టను దిగజార్చింది. అవంతి కానీ ఆయన వర్గీయులు కానీ మొదట్నుంచీ వివాదాలకు తావిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేనను టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నా ఆ శాఖపై పట్టులేని వ్యక్తిగానే మిగిలిపోయారు.
జనసేనలో నో ఛాన్స్
పోనీ జనసేనకు వెళదామంటే అక్కడ దారులు మూసుకుపోయాయి. గత మూడేళ్ల లో పవన్ కల్యాణ్ ను మంత్రి అవంతి శ్రీనివాసరావు అనరాని మాటలు అనేవారు. పవన్ ను విమర్శించాలన్నా, తిట్టాలన్నా ప్రభుత్వ పెద్దలు మంత్రి అవంతిని రంగంలోకి దించేవారు. భవిష్యత్ పరిణామాలు ఊిహించకుండా అవంతి పిచ్చి పేలాపనలతో జనసేనానితో పాటు జనసైనికులను కించపరిచేవారు. ఇది వారి మదిలో మానని గాయంగా ఉండిపోయింది. ఒకవేళ వైసీపీ తిరస్కరించినా, టీడీపీలో అవకాశం లేకపోయినా జనసేన మాత్రం ఆయన్ను ఆహ్వానించే పరిస్థితుల్లో లేదు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగెట్రం చేసి ఎదిగిన అవంతికి చిరంజీవి కుటుంబసభ్యులపైనా ఎటువంటి అభిమానం లేకపోవడమే ఇందుకు కారణం.
Also Read:Hyderabad Pub Drugs: సినీ ప్రముఖులు దొరికారు.. ‘వాళ్లు’ పండుగ చేసుకుంటున్నారు..