ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయం వెళ్లనున్నారు. అక్కడి నుంచి జగన్ ఢిల్లీ బయల్దేరుతారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: కొడాలి వర్సెస్ దేవినేని.. గొల్లపూడిలో గోలగోల..!
మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. వాటితోపాటు ఏపీ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపైనా దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌షాతో జగన్ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ సీఎం భేటీ అవుతారని తెలుస్తోంది. పెండింగ్ నిధులతోపాటు ప్రాజెక్టులు పూర్తయ్యేలా బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రిని జగన్ కోరే అవకాశం ఉంది.
Also Read: వైసీపీలో వారిదే పెత్తనం.. : జగన్ కొంపముంచేది వాళ్లేనట..!
కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీతో సమావేశం అవ్వాల్సి ఉండగా.. ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంతో బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం బయల్దేరి వెళ్తున్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక అంతర్వేది రథం దగ్ధం అంశంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో.. వెంటనే నియమించాలని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్