Homeఆంధ్రప్రదేశ్‌AP Parties On Telangana: తెలంగాణపై పడ్డ ఆంధ్రా పార్టీలు.. అసలు స్ట్రాటజీ అదేనా?

AP Parties On Telangana: తెలంగాణపై పడ్డ ఆంధ్రా పార్టీలు.. అసలు స్ట్రాటజీ అదేనా?

AP Parties On Telangana: ఏదైనా రాజకీయ పార్టీ తాము అధికారంలోకి రావాలని భావిస్తుంది. అది సహజం కూడా. కానీ ఏపీలో రాజకీయ పక్షాలు తాము సొంత రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మాత్రం పక్క రాష్ట్ర రాజకీయాల్లో సమిధులుగా మారాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏపీలో అధికార పక్షంగా వైసీపీ ఉంది. ప్రధాన విపక్షాలుగా టీడీపీ, జనసేనలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు అధికారంలోకి రావాలని భావిస్తున్నాయి. అంతకంటే ముందుగా ఇవి తెలంగాణలో బలం చూపెట్టుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఏపీలో జనసేన, బీజేపీతో కలిసి నడవాలని టీడీపీ భావిస్తోంది. జనసేన వరకూ సానుకూల వాతావరణం ఉన్నా.. బీజేపీ మాత్రం చిక్కడం లేదు. బీజేపీ సహకారం తనకు ఎలా అందుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్న తరుణంలో ఆయనకు తెలంగాణ గుర్తుకొచ్చింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. కానీ అధికారాన్ని అందిపుచ్చుకోవడానికి కావాల్సిన బలం మాత్రం సమకూరడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఏ చిన్న అవకాశం వదలడం లేదు. అందుకే చంద్రబాబు తెలంగాణలో ఉన్న కాసింత బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. ఆ బలాన్ని బీజేపీకి అందించి అందుకు బదులుగా ఏపీలో సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

AP Parties On Telangana
chandrababu

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు వయసుకు మించి కష్టపడుతున్నారు. ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా తన సమయాన్ని తెలంగాణాకు కేటాయించడం శక్తికి, సామర్థ్యానికి మించిన పనే. అయితే బీజేపీని రూట్లోకి తెచ్చుకోవాలంటే శక్తికి మించి కష్టపడాల్సిందే. తన శక్తియుక్తులను కూడదీయాల్సిందే. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు చంద్రబాబుతో పాటు టీడీపీ దూరమైంది. నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయారు. అన్ని పార్టీల్లో తమ బెర్తులు సర్దుకున్నారు. అదృష్టం కొలదీ కొంతమంది టీఆర్ఎస్ గూటికి చేరుకొని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పదవులు అనుభవిస్తున్నారు. ఉద్యమ తెలంగాణ నాయకులను పక్కనపెట్టి మరీ బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ టీడీపీ నాయకులను చేరదీసి తన మాతృ పార్టీపైన అభిమానం చాటుకున్నారు. తన నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారంతా తిరిగి సొంత గూటికి చేరేచాన్స్ లేదు. అందుకే ఆయన సెటిలర్స్ ఎక్కువగా ఉండే ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో టీడీపీని బలోపేతం చేసి బీజేపీకి అప్పగించే పనిలో ఉన్నారు.

వైసీపీది మరీ విచిత్రమైన పరిస్థితి. 2014 ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు దక్కినా.. నాకు తెలంగాణ రాజకీయాలు వద్దంటూ ఆ ఐదుగర్ని తన మిత్రుడైన కేసీఆర్ గూటికి పంపించారు. 2018 ఎన్నికల్లో ఏకంగా అస్త్ర సన్యాసం చేసి తెలంగాణ రాజకీయాలకు సెలవు అంటూ దుకాణం మూసివేశారు. అయితే తన మిత్రుడు కేసీఆర్, తన రహస్య మిత్రుడు మోదీ మధ్య విభేదాలు రావడంతో ఎటు వెళ్లాలో తెలియక మౌనాన్నే ఆశ్రయించారు. కేసీఆర్ కు బాహటంగా మద్దతు తెలిపితే తనకు జరిగే నష్టం తెలుసు. అలాగని కేసీఆర్ ను వదులుకోవడానికి మనసు అంగీకరించడం లేదు. పక్కలో బల్లెంలా సోదరి షర్మిళ తయారైంది.అటు కేసీఆర్ బీఆర్ఎస్ గా తన పార్టీని విస్తరించిన సమయంలో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రం వర్కవుట్ అయ్యే అవకాశం లేదు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే అంతకంటే ఇంకేం కావాల్సింది అని కట్టప్పలా భావించే సజ్జల రామక్రిష్ణారెడ్డితో ప్రకటన చేయించారు.కేసీఆర్ కు కావాల్సిన సెంటిమెంట్ అస్త్రాన్ని అందించారు. అయితే ఈ చర్యలను గమనిస్తున్న బీజేపీ ఎక్కడ తనకు అపాయం తలపెడుతుందోనని జగన్ కు భయం.

AP Parties On Telangana
sajjala ramakrishna reddy

జనసేన సైతం తాను తెలంగాణలో పోటీచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అది మిత్రపక్షం బీజేపీతోనో.. లేకుంటే ఏపీలో తనతో కలవాలనుకుంటున్న టీడీపీతోనా అన్నది చెప్పడం లేదు. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో ఎవరి సాహాయమైన తీసుకునే స్థానంలో ఉండడంతో బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తోంది. అదే సమయంలో జనసేన పట్ల అధికార టీఆర్ఎస్ సానుకూలంగా ఉంది. అటు పవన్ సినిమా ఫంక్షన్లకు స్వయంగా కేటీఆర్ విచ్చేసిన సందర్భాలున్నాయి. అందుకేపవన్ బీజేపీతో మిత్రుడిగా ఏపీ వరకే పరిమితమవుతాడా? అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వపరంగా మోదీ అన్నిరకాల సాయం చేస్తోందన్న టాక్ ఉంది. అయితే గతంలో మాదిరిగా బీజేపీకి కాదని.. తనకున్న కొద్దిపాటి బలాన్ని జగన్ కేసీఆర్ కు అందిస్తారా? అన్నది కూడా అనుమానమే. అయితే ఏపీలో పార్టీల అవసరాల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో ఏపీ పార్టీలు పావులుగా మారాయనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular