Kapu VS Kamma: ఏపీలో కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని టిడిపి(TDP), జనసేన(Janasena) భావిస్తున్నాయి. కానీ కేవలం 24 అసెంబ్లీ స్థానాలకే జనసేన పరిమితం కావడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తద్వారా కాపు సామాజిక వర్గం ఓటు బదలాయింపు జరగదన్న విశ్లేషణలు ఉన్నాయి. దీనిని తప్పుపడుతూ కాపు సంఘం నేతలు పెద్ద ఎత్తున లేఖాస్త్రాలు సంధించారు. అయినా సరే పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనతో ఉన్నవారే తనవారని.. ఇష్టం లేని వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా తేల్చి చెప్పారు. దీంతో హరి రామ జోగయ్య, ముద్రగడ కుటుంబాలు వైసీపీ వైపు వెళుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కుల చిచ్చు రగిలించే అనేక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని కాపు, కమ్మ కులాల మధ్య అంతరం పెంచేలా చర్యలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ లందరికీ టిడిపి టికెట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీటును జనసేన ఆశిస్తుండడంతో వివాదం ప్రారంభమైంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని తేల్చేశారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కందుల దుర్గేష్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటినుంచి వివాదం ప్రారంభం అయ్యింది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఇద్దరూ బలమైన నేతలే. ఎవరు పోటీ చేసినా పొత్తులో భాగంగా తప్పకుండా గెలుపొందుతారు. దీంతో టిక్కెట్ కోసం ఇద్దరు నాయకులు పట్టుబడుతున్నారు. తమ అధినేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే చంద్రబాబు సూచన మేరకు పవన్ దుర్గేష్ తో మాట్లాడారు. రాజమండ్రి రూరల్ బదులు నిడదవోలు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే తన అనుచరులతో మాట్లాడి చెబుతానని దుర్గేష్ పవన్ తో అన్నారు. రోజులు గడుస్తున్న దుర్గేష్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన సైతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం విషయంలో పట్టుతో ఉన్నట్లు సమాచారం. దీంతో ఇక్కడ కుల రాజకీయాన్ని ప్రత్యర్థులు తెరపైకి తీసుకురావడం ఉభయ పార్టీల్లో ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును అధికార పార్టీ వ్యతిరేకించింది. పొత్తు కుదరకూడదని భావించింది. ఒకవేళ కుదిరినా సీట్ల సర్దుబాటు దగ్గర వివాదం సృష్టించడానికి ప్రయత్నించింది. సీట్ల సర్దుబాటు సవ్యంగా జరిగినా.. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదని భావిస్తోంది. కాపు సంఘాల నేతల లేఖలు వెనుక వైసిపి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచం దిగని హరి రామ జోగయ్య లేఖలు ఎలా రాస్తారని.. అవి వైసిపి కార్యాలయం నుంచి వచ్చినవని అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ విషయంలో.. కమ్మ వర్సెస్ కాపు వివాదాన్ని తెరపైకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సీఎం జగన్ సొంత సామాజిక వర్గం నేతలకు టికెట్లు ఇవ్వని తరుణంలో.. పొత్తు ధర్మం కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని చంద్రబాబు ఒప్పించలేరా? అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మున్ముందు కాపు వర్సెస్ కమ్మ వివాదాన్ని మరింత విస్తృతం చేయాలని ఒక సెక్షన్ మీడియా ప్రయత్నిస్తోంది. దానిని చంద్రబాబు, పవన్ లు ఎలా అధిగమిస్తారో చూడాలి.