Amit Shah- ABN RK: తెలుగు నాట మీడియాలో ఎంతోమంది ఉద్దండులు ఉండవచ్చు గాక. కానీ వారిలో రామోజీరావు అందుకున్న స్థానం వేరు.. చాలామంది అసూయ పడతారు, విమర్శిస్తారు. కానీ రామోజీరావు ప్రస్తావన తీయకుండా మాత్రం ఉండరు.. ఇంతటి ఎనిమిది పదుల వయసులోనూ రామోజీరావు రాజకీయ గురువుగా ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు. అంతటి ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం లోనూ సార్క్ దేశాల అధినేతల పక్కన కూర్చుని ఆ కార్యక్రమాన్ని వీక్షించాడు అంటే ఆయనకు ఏ స్థాయి పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు.. అక్కడి దాకా ఎందుకు మొన్నటికి మొన్న బిజెపిలో నెంబర్ 2 గా కొనసాగుతున్న అమిత్ షా కూడా రామోజీరావు వద్దకు వెళ్లాడు. ఆయనతో చాలాసేపు మాట్లాడాడు.. సరే ఇప్పుడు రామోజీరావు విషయాన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన స్థానాన్ని అధిగమించే అవకాశం ఎవరికి ఉంది? తెలుగు నాట ఆ స్థానాన్ని భర్తీ చేసే మీడియా ఉద్దండుడు ఎవరు? అంటే దీనికి రాధాకృష్ణ పేరు వినిపిస్తోంది.. ఎందుకంటే తెలంగాణ పర్యటనకు వస్తున్న అమిత్ షా ఈసారి రామోజీరావును కాకుండా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను కలుస్తున్నారు. అది కూడా ఆయన సొంత నివాసంలో. నిన్నా మొన్నటి వరకు అమిత్ షా టూర్ షెడ్యూల్లో రాజమౌళి, ప్రభాస్ పేర్లు మాత్రమే ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ఆ జాబితాలోకి వేమూరి రాధాకృష్ణ పేరు రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
టిడిపి బీట్ చూసి..
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పాత్రికేయ జీవితాన్ని టిడిపి పార్టీ బీట్ చూసే విలేఖరిగా ప్రారంభించారు. ఆ తర్వాత తాను పని చేస్తున్న సంస్థను కొనుగోలు చేశారు. అంతేకాదు ఆ సంస్థను అంచలంచెలుగా ఎదిగేలా చేశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఎడిషన్లు కూడా నిర్వహిస్తోంది.. ఇక ఆయన ప్రారంభించిన ఏబీఎన్ ఛానల్ కూడా టాప్ ఫైవ్ లో ఉంది. యూ ట్యూబ్ వీక్షణల ప్రకారం నేషనల్ లెవెల్ లో టాప్ 4 లో ఉంది. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఎంతో కొంత ప్రభావితం చేయగల సత్తా రాధాకృష్ణకు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాయడంలో ఆయన సంస్థలు ముందున్నాయి. ఇరు ప్రభుత్వాలు కూడా ఎటువంటి ప్రకటనలు ఇవ్వకపోయినప్పటికీ తన సంస్థను ముందుకు నడిపిస్తున్నారు.. ఇక ఈ మొండి తనమే అమిత్ షా కు నచ్చి రాధాకృష్ణను కలిసేందుకు మక్కువ ప్రదర్శిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది..
పూర్తి విభిన్నమైనది
అమిత్ షా మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను కలుస్తున్నారు.. గతంలో తెలుగు నాట రామోజీరావును, జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ తేజ్ ను, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, హీరో నితిన్ ను షా కలిశారు. తాజాగా ఎస్ ఎస్ రాజమౌళిని కలబోతున్నారు.. ఇక ఈ జాబితాలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కూడా ఉన్నారు. రాజమౌళితో భేటీ కంటే రాధాకృష్ణతో భేటీ చిత్రమైనది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం క్రమేపీ మారుతున్నది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా జగన్ పరిపాలన మీద విరుచుకుపడ్డారు. అయితే ఈ సందర్భాలను చూసిన వైసిపి శ్రేణులు .. టిడిపి తో బిజెపి పొత్తు కుదుర్చుకుంది కాబట్టే అమిత్ షా, జేపీ నడ్డా లో మార్పులు వచ్చాయని భావిస్తున్నాయి. ఇక దీనికి తోడు చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాటుపడుతున్న వారిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒకడు. అందుకోసమే తన పత్రికలో జగన్ మీద విషం చిమ్ముతున్నాడు. అంతే కాదు చంద్రబాబు నాయుడు ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమిత్ షా తో చంద్రబాబు నాయుడుతో పొత్తుకు సంబంధించి చర్చలకు ఆస్కారం ఉండే అవకాశం కనిపిస్తోంది. పొత్తు మంచిదనే సలహా కూడా ఆర్కే ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. కేవలం భేటీ మాత్రమే కాకుండా అమిత్ షాకు గుజరాతి స్టైల్ లో రాధాకృష్ణ ఆతిథ్యం కూడా ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఇక సీనియర్ ఎన్టీఆర్ ను అప్పట్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు రామోజీరావు విశేష కృషి చేశాడు. ముఖ్యంగా తన ప్రాంతంలో ఎవరికి టికెట్లు ఇవ్వాలో కూడా డిసైడ్ చేసేవాడు. అంతటి రామోజీరావు తర్వాత ఆ స్థాయిలో తాను కూడా వెలిగిపోవాలని రాధాకృష్ణ అనుకొని ఉండవచ్చు. అందు గురించే బెదిరించాడో, భయ పెట్టాడో తెలియదు కానీ మొత్తానికి అమిత్ షా టూర్ లో తన పేరు ఉండేలా చూసుకున్నాడు. మరి ఇప్పుడు రామోజీరావు లాగా రాధాకృష్ణ మారతాడా? అమిత్ షా ను పొత్తు కోసం ఒప్పిస్తాడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.