Amit Shah- Bandi Sanjay: భారతీయ జనతాపార్టీ అధ్యక్ష పీఠాన్ని అనూహ్యంగా దక్కించుకున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయకుమార్.. పార్టీ జాతీయ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతున్నారు. అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న బండి తన సారథ్యంలో దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో కార్పొరేటర్ స్థానాలు సాధించి గులాబీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. తాజాగా 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రజాసంగ్రామయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రెండు విడతల యాత్ర పూర్తిచేసిన బండి సంజయ్‌కు అధిష్టానం కూడా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. అన్ని విధాల అండగా నిలుస్తోంది. మేమున్నాం.. ఇప్పుడు కాకపోతే.. ఇక ఎప్పుడూ కాదు అని భరోసా ఇస్తోంది. జాతీయ నాయకత్వం అండతో తెలంగాణలో కాషాయ దళపతిగా పారీ్ౖటపై ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న భరోసా కలిగిస్తున్నారు.
అమిత్‌షా భరోసా..
రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభకు కేంద్ర హోంమత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేసీఆర్‌ను ఓడించడానికి అమిత్ షా రానక్కర లేదు.. బండి సంజయ్ చాలు’ అంటూ తుక్కుగూడ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ రథసారధిపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ సంజయ్ సారథ్యం వహిస్తాడని అధిష్టానం ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చిందని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో ఉన్న నాయకత్వ పోరుకు అంతం పలికిపోయినట్లయింది. ఇక నుంచి బండి సంజయ్ మాత్రమే ఏకైక లీడర్ అని అమిత్ షా చెప్పకనే చెప్పారని సంజయ్‌వర్గం ఘనంగా ప్రకటించుకుంటోంది.
Also Read: Bandi Sanjay: ఒక్క సారి అవకాశం ఇవ్వరా? బండి సంజయ్ అభ్యర్థన
బలంగానే బండి వ్యతిరేక వర్గం..
తెలంగాణ బీజేపీలో బండి సారథ్యాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. వ్యతిరేక వర్గం బలంగానే ఉంది. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువురు సీనియర్ నేతలు బండి సంజయ్ ఇంత వేగంగా దూసుకు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి ఇప్పటి వరకూ తెలంగాణ బీజేపీకి బ్రాండ్‌గా ఉన్నారు. ఆయన కేంద్రమంత్రిగా వెళ్లడం.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుగా బండి సంజయ్ పదవి చేపట్టడంతో పరిస్థితులు మారిపోయాయి. తనపైన ప్రకటనలతో బండి సంజయ్ పాపులారిటీ పెంచుకున్నారు. పాదయాత్రతో మరింతగా ప్రజల్లోకి వెళ్లారు. ఈ కారణంగా బండి సంజయ్ శ్రమ అమిత్ షా దృష్టిలో పడినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా ఇక నుంచి బండి సంజయ్ ప్రాబల్యం తెలంగాణ బీజేపీలో పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొంత మంది నేతలు తమ తమ ప్రాధాన్యాలపై ఆశలు పెట్టుకున్నా .. ఎవరైనా బండి సంజయ్ తర్వాతనే అన్న ఓ అభిప్రాయం కల్పించేలా తుక్కుగూడ సభ జరిగింది. ఇది బీజేపీలో కొత్త సమస్యలకు దారి తీస్తుందా లేదా వర్గ పోరాటాన్ని మరింత పెంచుతుందా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఎన్నికల రథసారధి అతనే..
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలోనే బరిలో దిగుతుందని అమిత్‌షా ప్రకటనతో స్పష్టమైంది. దీంతో ఇన్నాళ్లూ.. ఏ నిర్ణయమైనా అధిష్టానం తీసుకుంటుందని చెబుతూ వచ్చిన బండి సంజయ్ తుక్కుగూడ సభా వేదికగా ఎన్నికల కెప్టెన్ తానే అని ప్రకటించేలా చేశారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. బండి వ్యతిరేక వర్గానికి చెక్‌పెట్టే ప్రయత్నంలో భాగంగానే అమిత్‌షా ఈ ప్రకటన చేసి ఉంటారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు అంతర్గతంగా పార్టీ శ్రేణులతో అమిత్‌షా జరిపిన సమావేశంలోనూ అమిత్‌షా ఈమేరకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టాలని, వర్గాలు, గ్రూపులు సహించేది లేదని షా హెచ్చరిక కూడా చేసినట్లు తెలుస్తోంది. సుమారు గంట 45 నిమిషాలు ముఖ్య నేతలతో వేర్వేరుగా జరిపిన సమావేశంలో పార్టీ గెలుపుపై స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. మొత్తంగా అధిష్టానం ఇచ్చిన భరోసాతో తెలంగాణలో బండి సంజయ్ మరింత దూకుడు పెంచుతారన్న అభిప్రాయం వ్యక్తమువుతోంది.
Also Read:AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో మరో ఐఏఎస్ కు జైలు