Ambati Rambabu: సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్థాయి వ్యక్తులు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ రెండు రోజుల కిందట జనసేన అధ్యక్షుడు పవన్ ఆరోపణలు చేశారు.అయితే తాను ఒక పైసా అవినీతి చేశానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అంబటి రాంబాబు సవాల్ చేశారు. దానికి కట్టబడి ఉంటే మాత్రం అంబటి రాంబాబు తప్పకుండా రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఒక ప్రాణం ఖరీదులో సగం తనకు ఇవ్వాల్సిందేనని అంబటి డిమాండ్ చేసిన విషయాన్ని స్వయంగా బాధిత కుటుంబమే వ్యక్తపరచింది. పవన్ ఆరోపణల కంటే స్వయంగా బాధిత కుటుంబమే ఈ ఆరోపణలు చేస్తే దానికి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం మన నోటిపారుదల శాఖ మంత్రి అంబటిపై ఉంది. ఏపీలో మంత్రులు బరితెగించారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదు. ఒక్క మంత్రే కాదు.. ఆయన్ను అనుసరిస్తున్న వ్యక్తులు ఇప్పుడు సత్తెనపల్లిలో అవినీతికి డోర్లు తెరిచారని తెలియడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ వ్యాప్తంగా చర్చకు కారణమైంది.

సత్తెనపల్లికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు డ్రైనేజీ పనులకు వెళ్లాడు. పనుల్లో భాగంగా ఊపిరాడక మృతిచెందాడు. ప్రభుత్వం రూ,5 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో మంజూరు చేసింది. అయితే అందులో సగం రూ.2.50 లక్షలు ఇస్తే కానీ కుదరదని స్వయంగా అంబటి వారే సెలవివ్వడంతో ఏం చేయాలో పాలుపోక బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పవన్ అంబటిని ఉద్దేశించి కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించడం విశేషం.పవన్ ది ఆరోపణ కాదు.. నిజమేనని ఇప్పుడు ఏపీ సమాజం కూడా నమ్ముతోంది. నిర్ణయం తీసుకోవడం అన్నది ఇప్పుడు అంబటి కోర్టులో ఉంది.
గుంటూరు దాసరిపాలెం కు చెందిన పర్లయ్య, గంగమ్మలు పొట్ట చేతిన పట్టుకొని ఉపాధి కోసం సత్తెనపల్లికి వచ్చారు. రోడ్డు పక్కన గుడిసె వేసుకొని నివాసముంటున్నారు. వారి మైనర్ కుమారుడు ఉపాధి కోసం డ్రైనేజీ పనులకు వెళ్లి చనిపోయాడు. దానిపై వివాదం రేగకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించారు. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి ఇచ్చుంటే అక్కడితే వివాదం సమసిపోయేది. కానీ స్థానిక మునిసిపల్ చైర్మన్ ఆ నగదులో తనకు సగం ఇస్తే కానీ చెక్కు ఇవ్వనని షరతు పెట్టాడు. బాధిత కుటుంబం మంత్రి అంబటిని కలిస్తే.. కచ్చితంగా ఇవ్వాల్సిందేనని.. ఆయన కాకపోతే నేను తీసుకుంటానని.. ఆ మొత్తం కట్టి మిగతా అమౌంట్ తో సర్దుకుపోవాలని సూచించారుట. కుమార్తె వివాహం నిశ్చయం చేసుకున్నామని బాధిత దంపతులు కాళ్లావేళ్లా పడినా అంబటి కనికరించలేదు. మంత్రి, వైసీపీ నేతల తీరుతో కుమారుడ్ని పొగొట్టుకున్న ఆ దంపతులు మనోవేదనకు గురయ్యారు.

పర్లయ్య, గంగమ్మలు తమ ఆవేదన చెప్పుకున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి అబద్ధాలని చెప్పించే ప్రయత్నంలో భాగంగా అధికార పార్టీ నాయకులు వారిని భయపెట్టారు. దీంతో ఓ పార్టీ నాయకుల సాయంతో ఆ దంపతులు ఆత్మరక్షణకు ఎవరికీ తెలియని ప్రదేశంలో తలదాచుకుంటున్నారు. కుమారుడ్ని కోల్పోయి పుట్టెడు విషాదంలో ఉన్న వారినుంచి డబ్బులు కొట్టేయ్యాలన్న మంత్రి, వైసీపీనేతల తీరు ఈ ప్రభుత్వంలో ఉన్న లంచగొండి తనాన్ని బయటపెట్టింది. శవాల మీద పేలాలు ఏరుకుంటున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అంబటి స్పందిస్తారా.. లేదా ఇదంతా విపక్షాల కుట్ర అని రంకెలు వేస్తారా? అన్నది చూడాలి మరీ.