Amaravati: అమరావతి రాజధాని విషయం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తేల్చేసింది. ఏపీ రాజధాని అమరావతియేనని కేంద్రం పలు సందర్భాల్లో తేల్చి చెప్పింది. రాజకీయ పార్టీగా అమరావతికే మద్దతు తెలిపింది. అమరావతి రాజధానికి పలు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేసింది. కొన్నింటికి నిధులు కూడా మంజూరు చేసింది. కానీ ఇప్పుడు అదనపు నిధులకు మాత్రం కోత విధించింది. ఇకపై ఆ స్థాయిలో నిధులు ఇవ్వలేమని తేల్చేసింది.
గతంలో అమరావతిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం 930 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మొత్తం 19 ప్రాజెక్టులకు గాను 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటికి 627 కోట్ల నిధులు చెల్లింపులు చేశారు. మరో ఏడు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సైతం కేంద్రం తరఫున చెల్లించాల్సిన వాటా విధులను ఎప్పుడో ఇచ్చేసినట్లు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు.
వాస్తవానికి బిజెపి రాజకీయ స్టాండ్ గా అమరావతిని రాజధానిగా తీసుకుంది. కానీ ఇప్పుడు మరిన్ని నిధుల కేటాయింపు విషయంలో మాత్రం మొండి చేసి చూపుతుంది. నిధుల మంజూరు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.అటు రాజకీయంగా అమరావతికి మద్దతు తెలుపుతూ.. నిధుల పరంగా మొండి చేయి చూపడంతో బిజెపి తీరు విమర్శల పాలవుతోంది.
ఇప్పటికే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. రైతుల నుంచి సేకరించిన భూములను విక్రయించడానికి సిద్ధపడింది. ఆర్ 5 జోన్ న్ ఏర్పాటుచేసి 50 వేల మందికి ఇళ్ల పట్టాలందించింది. మరోవైపు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు నడుస్తోంది. ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దీంతో కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయకూడదని కేంద్రం తీర్మానించుకున్నట్టుంది. ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఏమైనా చేద్దామని కేంద్రం భావిస్తున్నా.. కోర్టు కేసులు అడ్డంగా నిలుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.